మినీ గోకులాల నిధులు స్వాహా
● క్షేత్రసహాయకుడి అవినీతి బాగోతం
● రూ.13 లక్షల రికవరీకి ఆదేశాలు
రాయదుర్గం: డి హీరేహాళ్ మండలం మురడి, గొడిశెలపల్లి, దొడగట్ట, డి.హీరేహాళ్ గ్రామాల్లో మినీ గోకులం బిల్లుల మంజూరులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. 2014–19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంజూరైన గోకులం షెడ్లకు సంబంధించి చివరి బిల్లులో 30 శాతం మిగులు నిధులను ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్‌ఐసీ సర్వర్ మార్పులు, చేర్పుల్లో భాగంగా రైతుల ఖాతాలు ఆన్‌లైన్‌లో తొలిగిపోవడంతో డి.హీరేహాళ్ మండలంలోని మురడికి చెందిన క్షేత్ర సహాయకుడు వెండర్ ఖాతా తెరిచి అందులో జమ చేశారు. ఈ క్రమంలో కొందరు అధికారులు కుమ్మకై ఏకంగా రూ.13 లక్షలు దారి మళ్లించారు. ఆలస్యంగా తెలుసుకున్న రైతులు తమ బిల్లులు ఇప్పించాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. దీంతో అవినీతి బాగోతం బహిర్గతమైంది.
సగం డబ్బు వాపస్?
అవినీతి తెలుసుకున్న ఎంపీడీఓ దాసనాయక్, ఏపీఓ సంజీవ్‌కుమార్ మురడిలో విచారణ చేపట్టి మురడి, డి.హీరేహాళ్, గొడిశెలపల్లి, దొడగట్ట గ్రామాలకు చెందిన రైతుల డబ్బులు రూ.13 లక్షలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ తీర్మానం జరిపి ఆ డబ్బంతా తిరిగి రైతులకు చెల్లించేలా ఒప్పించారు. లేకపోతే క్రిమినల్ కేసు నమోదు చేయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో పంచుకున్న సొమ్ములో సగం రైతులకు చేర్చారు. మిగిలిన సగం సర్ధుబాటులో ఉన్నారు. కాగా, ఈ అవినీతి బాగోతం లో బాగస్వామ్యులైన వారందరిపై చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా అప్పట్లో 60కు పైగా షెడ్లు నిర్మించారు. కాగా ఏకమొత్తంగా రూ.13 లక్షలను క్షేత్ర సహాయకుడి ఖాతాకు బదిలీ చేయడంతో ఏ రైతుకు ఎంత మొత్తం చెల్లించాలనే విషయంపై కాస్త జాప్యం చోటు చేసుకుందని ఎంపీడీఓ దాసనాయక్ పేర్కొన్నారు. ప్రతి రూపాయి రైతుకు చేర్చాలని ఆదేశించామన్నారు. ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉన్న అధికారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.


