●‘రూటే’ సపరేట్
అనంతపురం అర్బన్: ఆయన డిప్యూటీ కలెక్టర్. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఏమిటి ఆయన ‘స్పెషల్’ అని అనుకుంటున్నారా? అయితే చూడండి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓల మాదిరిగా కాదు... ఆయన రూటే ‘స్పెషల్’. తన వాహనానికి ముందు భాగంలో నంబర్ ప్లేట్‌ను తొలగించి ‘డిప్యూటీ కలెక్టర్, ఏపీఎస్‌సీఎస్‌సీఎల్ డిస్ట్రిక్ట్ మేనేజర్, అనంతపురం’ అనే బోర్డు ఏర్పాటు చేయించారు. అయితే ఇబ్బందేమిటి అంటారా? ఆర్‌టీఏ నిబంధనల ప్రకారం వాహనానికి ముందు, వెనక తప్పనిసరిగా నంబర్ ప్లేట్ ఉండాలి. ఈ నిబంధనను కలెక్టర్ మొదలు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తప్పని సరిగా గౌరవిస్తూ తమ వాహనాలకు ముందు, వెనుక నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. నిబంధనలు అనుసరించడంలో ముందు వరసలో ఉండాల్సిన ఓ జిల్లా అధికారి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ‘స్పెషల్’ కాదంటారా?


