బీఎల్‌ఓలకు గౌరవ వేతనం పెంపు
అనంతపురం అర్బన్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్‌ఓల గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనం ఈ ఏడాది ఆగస్టు నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో ప్రస్తుతం 2,226 మంది బీఎల్‌ఓలు ఉన్నారు. కొత్తగా మరో 330 మందిని నియమించనున్నారు. దీంతో బీఎల్‌ఓల సంఖ్య 2,556కు చేరుతుంది. 250 మంది సూపర్‌వైజర్లు ఉన్నారు. ఇప్పటి వరకు బీఎల్‌ఓలకు ఏడాదికి రూ.6 వేలు, సూపర్‌వైజర్లకు రూ.12 వేలు, ఇంటింటి తనిఖీలు, శిక్షణకు అదనంగా రూ.1,000 చెల్లించేవారు. ఎన్నికల సంఘం ఆదేశంతో బీఎల్‌ఓలకు తాజాగా గౌరవ వేతనం ఏడాదికి రూ.12 వేలు, సూపర్‌వైజర్లకు రూ.18 వేలు, ఓటరు జాబితా సవరణ, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు బీఎల్‌ఓలకు అదనంగా రూ.2 వేలు చెల్లిస్తారు. ఏడాది పొడవునా పనిచేసిన వారికి పూర్తి గౌరవవేతనం, మధ్యలో చేరిన వారికి, తక్కువ కాలం పనిచేసిన వారికి.. వారు పనిచేసిన కాలానికి చెల్లింపులు ఉంటాయి.
తాగునీటి ఎద్దడిపై నిరసన
కుందుర్పి: తాగునీటి సమస్య తీర్చాలంటూ బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో కుందుర్పి మండలం మహంతపురం గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తనను గెలిపిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఎన్నికల సమయంలో హామీనిచ్చిన అమిలినేని సురేంద్రబాబు.. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం సమస్య పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు. నెల రోజులుగా చుక్క నీరు అందకపోవడంతో బిందెడు నీటి కోసం కుందుర్పికి వెళ్లి రూ.10తో కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీఓ మాధవికి వినతిపత్రం అందజేశారు.


