యువకుడి బలవన్మరణం
అనంతపురం సిటీ: స్థానిక ప్రసన్నాయపల్లి రైలు మార్గంలో ఓ గుర్తు తెలియని యువకుడు(25) బుధవారం గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ సమాచారంతో జీఆర్పీ ఎస్‌ఐ వెంకటేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. నలుపురంగు హాఫ్ చొక్కా, సిమెంట్ కలర్ జీన్స్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94414 45354 కు సమాచారం అందించాలని కోరారు.
40 మందితో జిల్లా టీడీపీ కమిటీ ప్రకటన
అనంతపురం టౌన్: జిల్లాలో టీడీపీని బలోపేతం చేసే దిశగా 40 మందితో కూడిన నూతన కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసుల ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి బుధవారం ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా 9 మంది, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శులుగా 9 మంది, జిల్లా అధికార ప్రతినిధులుగా 9మంది, జిల్లా కార్యదర్శులుగా 9మంది, ట్రెజరర్, మీడియా కోర్డినేటర్, సోషల్ మీడియా కోర్టినేటర్, ఆఫీస్ సెక్రెటరీగా ఒక్కొక్కరిని చొప్పున ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
‘ఉమ్మడిశెట్టి అవార్డు’కు
కవితల ఆహ్వానం
అనంతపురం కల్చరల్: ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–25’కు గాను కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు అవార్డు వ్యవస్థాపకుడు, సీనియర్ కవి డాక్టర్ రాధేయ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025లో ప్రచురించిన కవితా సంపుటాలను జనవరి 10వ తేదీలోపు ‘డాక్టర్ రాధేయ, చైర్మన్, ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్టు, 13–1–606–1, షిరిడినగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురం – 515 001’ చిరునామాకు పంపాలి. ఎంపికై న కవిని నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించనున్నారు. పూర్తి వివరాలకు 99851 71411లో సంప్రదించవచ్చు.


