కంది రైతుల్లో కలవరం | - | Sakshi
Sakshi News home page

కంది రైతుల్లో కలవరం

Dec 25 2025 8:11 AM | Updated on Dec 25 2025 8:11 AM

కంది రైతుల్లో కలవరం

కంది రైతుల్లో కలవరం

మార్కెట్లో పప్పు ధాన్యాల ధరలు ఆశాజనకంగా ఉండటంతో జిల్లాలో ఎక్కువ మంది రైతులు కంది సాగుపై మొగ్గుచూపారు. అత్యధికంగా ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో సాగైంది. ఇప్పటికే రైతులు పంటలను నూర్పిడి చేసి పొలాలు, మార్కెట్‌యార్డుల్లో రాశులు పోసుకుని అమ్ముకునేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రాలు ఇప్పుడప్పుడే ఏర్పాటు చేసేలా కనిపించకపోవడంతో రైతుల్లో కలవరం మొదలైంది.

ఉరవకొండ: కందులు అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దళారులకు తక్కువ ధరకు అమ్ముకోలేక.. ప్రభుత్వం మద్దతు ధరతో కొనేందుకు కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ కంది సాధారణ సాగు విస్తీర్ణం 55,296 హెక్టార్లు అంచనా వేయగా.. ఏకంగా 1.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చింది. అననుకూల వర్షాలతో అక్కడక్కడ మోస్తరుగా దిగుబడులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. హెక్టారుకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి లెక్కించినా పది లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి చేతికి వస్తుంది. అయితే మార్కెట్‌లో కందికి సరైన ధర లేకపోవడంతో రైతులు ప్రభుత్వంపై ఆధారపడ్డారు. ఈ క్రమంలో నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌ అధికారులు కూడా కంది కొనుగోలుకు ఇటీవల ప్రకటన చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాలు రూ.8 వేల ప్రకారం కొనుగోలు చేస్తామని, ఆర్‌ఎస్‌కేల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. దీంతో ఇప్పటికే 2,500 మంది రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకుని అమ్మడానికి ఎదురు చూస్తున్నారు.

కొనుగోళ్లు కంటితుడుపేనా..?

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సంక్రాంతి తర్వాతనే ఏర్పాటు కావొచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అది కూడా ఈ ఏడాది 24 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. భారీ విస్తీర్ణంలో పంట సాగులో ఉన్నందున పండిన కందులన్నింటినీ కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతలోపు చాలామంది రైతులు అయినకాటికి అమ్మేసుకుంటారని అంచనా వేస్తున్నారు. చివర్లో కంటితుడుపుగా కొనుగోళ్లకు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కూడా ఈ–క్రాప్‌, ఒక్కో రైతు నుంచి పరిమితంగా కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున కంది సాగు చేసిన రైతులు ఇపుడు అమ్మకాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బెంబేలెత్తిస్తున్న నిబంధనలు

రైతుల నుంచి కందులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పెడుతున్న నిబంధనలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి రైతూ ఈ–పంట నమోదు తప్పనిసరిగా చేయించుకుని ఉండాలని, గింజ నాణ్యత ప్రమాణాల్లో తేమ 12 శాతం ఉండాలని స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది రైతుల నుంచి హెక్టారుకు 2 లేదా 3 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడంతో మిగిలిన పంట అమ్ముకోలేక రైతులు అవస్థలు పడ్డారు. నిబంధనలను సడలించి కందులను పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

దళారులే ధర నిర్ణేతలు

పంట ఉత్పత్తుల ధర నిర్ణయించడంలో దళారుల పాత్ర కీలకంగా మారింది. బహిరంగ మార్కెట్లో పంటకు మంచి ధర పలుకుతున్నా దళారులు మాత్రం తాము చెప్పిన ధరే మార్కెట్లో నడుస్తోందంటూ రైతులను మభ్యపెడుతున్నారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లి పంట అమ్ముకోవాలంటే ఖర్చులు పెరుగుతాయి. దీన్ని దళారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. అలాగే 50 కిలోల బస్తాలో ఐదారు కిలోలు ఎక్కువ తీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు.

పేర్లు నమోదు చేసుకోండి

కంది పంటకు సంబంధించి జనవరి రెండో వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ–పంట నమోదు చేసుకున్న వారు రైతు సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది.

– పెన్నేశ్వరి, మార్క్‌ఫెడ్‌ డీఎం

కొనుగోళ్లు ఆలస్యం

సంక్రాంతి తరువాతనే కేంద్రాల ఏర్పాటు

24 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకే అనుమతులు

ఖరీఫ్‌లో అంచనాలకు మించి 1.34 లక్షల హెక్టార్లలో సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement