బీమా.. గీమా.. నై!
అనంతపురం అగ్రికల్చర్: విపత్తుల కారణంగా పంటలు కోల్పోయిన సమయంలో రైతులకు పంటల బీమా పరిహారం కాసింత ఉపశమనం కలిగిస్తుంది. అలాంటి పంటల బీమా పథకాల అమలు గురించి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అతికించిన పోస్టర్ల ప్రకారం ప్రీమియం చెల్లింపు గడువు డిసెంబర్ 15తోనే ముగిసింది. గడువు ముగిసి ఇప్పటికి పది రోజులవుతున్నా పంటల బీమా అమలు, ప్రీమియం చెల్లింపు గడువు పొడిగింపు గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఈ నెలాఖరుకు రబీ సీజనే ముగుస్తున్నా వాతావరణ బీమా, ఫసల్‌బీమా పథకాలు ఉన్నాయా లేదా అనేది అటు వ్యవసాయశాఖ ఇటు ఉద్యానశాఖ, మరోవైపు మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరుమెదిపే పరిస్థితి కనిపించడం లేదు. ప్రీమియం కట్టేందుకు చాలా మంది రైతులు సిద్ధంగా ఉన్నా... ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు.
● ఈ రబీలో ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి, పప్పుశెనగకు వర్తింపజేశారు. జనరలీ సెంట్రల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో అమలు కానున్న బీమా పథకంలో వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పప్పుశనగ ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఖరారు చేయగా.. అందులో రైతులు తమ వాటా కింద రూ.450 ప్రకారం ప్రీమియం చెల్లించాలి. వేరుశనగకు ఎకరాకు రూ.32 వేలు కాగా, ప్రీమియం రూ.480, జొన్నకు రూ.21 వేలు కాగా, ప్రీమియం రూ.315, మొక్కజొన్నకు రూ.35 వేలు కాగా ప్రీమియం రూ.525 ప్రకారం, వరికి రూ.42 వేలు కాగా ప్రీమియం రూ.630 ప్రకారం చెల్లించాలి. అలాగే టమాటకు బీమా వర్తింపజేసినట్లు ఉద్యానశాఖ చెబుతున్నా.. ప్రీమియం గురించి స్పష్టత ఇవ్వడం లేదు. ప్రీమియం కట్టడానికి వరికి ఈ నెలాఖరు వరకు గడువు ఉండగా, మిగతా పంటలకు ఈనెల 15లోపు గడువు దాటిపోయింది. ఇక ఈ–క్రాప్ ప్రక్రియను కూడా అస్తవ్యస్తం చేశారు.
జగన్ హయాంలో ఉచితంగా బీమా..
రబీ పంటల బీమాకు మంగళం!
10 రోజుల కిందటే ముగిసిన ప్రీమియం గడువు
బీమా పథకాలపై స్పష్టత ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2019–2024 మధ్య సమయంలో రైతులపై ప్రీమియం భారం మోపకుండా వాతావరణ, ఫసల్‌బీమా పథకాలు పూర్తిగా ఉచితంగా అమలు చేశారు. ఈ–క్రాప్ ఆధారంగా నిబంధనల మేరకు సకాలంలో బీమా కింద పరిహారం కూడా ఇచ్చి ఆదుకున్నారు. విస్తారంగా వర్షాలు పడ్డాయి. అంతో ఇంతో పంట దిగుబడలు కూడా చేతికివచ్చాయి. కానీ నిబంధనల మేరకు పంటల బీమా కింద అందాల్సిన మొత్తం రైతులకు ఇవ్వడం విశేషం. అలా అనంతపురం జిల్లాకు సంబంధించి నాలుగు సంవత్సరాలు బీమా కింద దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.1,205 కోట్లకు పైగా పరిహారం బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. పంటల బీమా పథకాలకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పంటల బీమా పథకాలు అంటే అలా ఉండాలని గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికారంలోకి రాగానే ఉచిత బీమా పథకాలకు మంగళం పాడేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అసలు పథకాలే లేకుండా ఎసరు పెట్టడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


