క్రీస్తు మార్గం అనుసరణీయం
అనంతపురం కల్చరల్: ప్రపంచ శాంతిని కోరుకునే క్రీస్తు మార్గం అనుసరణీయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. జిల్లాలోని క్రైస్తవులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు జననం శాంతికి సంకేతమని.. తన జీవితం, మరణం ద్వారా ఈ లోకానికి సరైన మార్గాన్ని చూపారని తెలిపారు. సమాజంలో చెడును పక్కన పెట్టి మంచిని పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడితేనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
అనంతపురం అర్బన్: జిల్లాలోని క్రైస్తవులకు కలెక్టర్ ఆనంద్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు చూపిన ప్రేమ మార్గం అనుసరణీయమన్నారు. ఆయన కృపాకటాక్షలతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.
చెరువులకు నీరివ్వడంలో
ఇంత నిర్లక్ష్యమా?
● మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం
పుట్లూరు: శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని చెరువులకు నీటిని సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా చెరువులకు సకాలంలో నీటిని సరఫరా చేసి, తాగు – సాగు నీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. నాడు చెరువులు నీటితో కళకళలాడేవని, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయిందని తెలిపారు. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో సుబ్బరాయసాగర్ ద్వారా చెరువులకు నీటిని సరఫరా చేయాల్సి ఉందన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం డిసెంబర్ నెల ముగస్తున్నా ఇప్పటికీ చెరువులకు చుక్కనీరు చేర్చని దుస్థితి నెలకొందన్నారు. వర్షాలు లేక పుట్లూరు మండలంలోని పలు గ్రామాల్లో తాగు, సాగు నీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుబ్బరాయసాగర్‌కు పూర్తిస్థాయిలో నీరు చేరినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా షట్టర్లు మరమ్మతుకు గురై నీటిని విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి చెరువులన్నీ నింపాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు.
చిక్క ఒడయార్ సమాఽధి గుర్తింపు
పుట్టపర్తిటౌన్: ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద చెరువు అయిన బుక్కపట్నం చెరువును నిర్మించిన చిక్క ఒడయార్ సమాఽధిని స్థానిక ఉపాధ్యాయుడు, చరిత్రకారుడు గోపి బుధవారం బుక్కపట్నం చెరువు వద్ద ఏనుగు తూము సమీపంలో గుర్తించారు. చిక్క ఒడయార్ విజయనగర సామ్రాజ్య రెండో చక్రవర్తి బుక్కరాయల వద్ద ప్రధానిగా పనిచేశారు. ఆయన బుక్కపట్నం చెరువుతో పాటు బుక్కరాయసముద్రం, కణేకల్లు, నాగసముద్రం, కనుముక్కల, మేడాపురం వంటి ఎన్నో చెరువులను నిర్మించినట్లు తెలిపారు. బుక్కపట్నం చెరువు పూర్తయిన తర్వాత వారి కుల దైవం చౌడేశ్వరిదేవి గుడిని కట్ట కింద నిర్మించారు. ఆ తర్వాత ఆయన మరణించగా ఆయన సమాధిని కూడా ఇక్కడే నిర్మించినట్లు గోపి తెలియజేశారు. అలాగే బుక్కపట్నం చెరువు సమీపంలో శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుత రాయల వారి శాసనాలు కూడా గుర్తించామన్నారు. చిక్క ఒడయార్ సమాధి మీద శివలింగాన్ని ప్రతిష్టించిందున బుక్కపట్నం పరిసర గ్రామాల ప్రజలు చుక్కోల రాయునిగా పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
క్రీస్తు మార్గం అనుసరణీయం
క్రీస్తు మార్గం అనుసరణీయం
క్రీస్తు మార్గం అనుసరణీయం


