అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలి
అనంతపురం అర్బన్: నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతుల సమస్యకు పరిష్కారం చూపించే అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయో హెల్త్, క్రాప్ హెల్త్ మానిటరింగ్, ఫర్టిలైజర్ వినియోగం, మైక్రో ఇన్నోవేషన్ మానిటరింగ్, తదితర స్టార్టప్‌లు, ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఉద్యాన శాఖ ద్వారా సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. స్టార్టప్ ఆలోచన బాగుంటే రుణాలు ఇప్పించాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. అగ్రిస్టార్టప్‌లు ఉత్పత్తి చేసే వస్తువులు బాగుంటే వాటిని మార్కెటింగ్ చేయగలిగే కంపెనీలను గుర్తించాలని సూచించారు. రబీలో ఇప్పటి వరకు 60 శాతం పంటలు సాగయ్యాయని వ్యవసాయాధికారి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవ కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. నేషనల్ బ్యాంబూ మిషన్ కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్‌చంద్, ఉద్యానశాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, ఆత్మా పీడీ పద్మలత, ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శైలజ, మత్స్య శాఖ డీడీ చంద్రశేఖర్‌రెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ అధికారి మెహతాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


