కార్యకర్తలకు తోడుగా ఉంటా..
● మాజీ ఎంపీ తలారి రంగయ్య
కళ్యాణదుర్గం: నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అన్ని వేళలా తోడుగా ఉంటానని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య భరోసానిచ్చారు. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సర్పంచ్ ఆదినారాయణరెడ్డితో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులను సోమవారం అర్ధరాత్రి నుంచి పోలీసుస్టేషన్‌లోనే కూర్చోబెట్టుకున్న ఘటరపై రంగయ్య తనదైన శైలిలో స్పందించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి బెయిల్‌పై బయటకు వచ్చే వరకూ రంగయ్య సాగించిన పోరాటం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. పార్టీ కార్యాలయంలోనే ఉండి ఎప్పటికప్పుడు లీగల్ సెల్ టీం సభ్యులను సమన్వయం చేసుకుని బెయిల్‌పై నాయకులు, కార్యకర్తలను బయటకు రప్పించారు. అనంతరం వారు పార్టీ కార్యాలయంలో రంగయ్యను కలసి కృతజ్ఞతలు తెలిపడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ టీం సభ్యులను రంగయ్య సన్మానించి, మాట్లాడారు. బొమ్మగానిపల్లిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మ దినం సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించిన పార్టీ నాయకులపై టీడీపీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, లీగల్ సెల్ నాయకులు ఎర్రిస్వామి, బీటీ రామాంజనేయులు, రామాంజనేయులు, పార్టీ వివిధ మండలాల కన్వీనర్లు సుధీర్, చంద్రశేఖర్ రెడ్డి, గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, హనుమంతరాయుడు, ఎంపీపీలు భీమేష్, చంద్రశేఖర్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


