జగన్ ఫ్లెక్సీపై పోలీసుల అత్యుత్సాహం
కూడేరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కూడేరు మండలం ఉదిరిపికొండలో పార్టీ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్ల మకానం వద్ద ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, పార్టీ జెండాలపై పోలీసులు అత్యుత్సాహం కనబరిచారు. తక్షణమే వాటిని తొలగించాలంటూ తమదైన శైలిలో గ్రామస్తులకు వార్నింగ్ ఇచ్చారు. తమ అభిమాన నేత పుట్టిన రోజు వేడుక జరపుకోవడం కూడా తప్పేనా? అంటూ పోలీసులను గ్రామస్తులు నిలదీయడంతో తమకు పెద్ద సార్ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని, వాటిని తొలగించుకోవాలని ఆదేశించి వెళ్లిపోయారు. అయితే గ్రామస్తులు వాటిని తొలగించుకుండా ఉంచేయడంతో సోమవారం రాత్రి మరోసారి ఉదిరిపికొండకు చేరుకుని పార్టీ నేతలపై రెచ్చిపోయారు. దీంతో నేతలు ఫ్లెక్సీ తొలగించారు. కానీ, పార్టీ జెండాను కూడా తొలగించాలని పోలీసులు పట్టుబట్టడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం ‘ఏపీకి జగన్ నీడ్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కట్టపై జెండావిష్కరణ చేశామని, ఈ జెండా వల్ల ఇక్కడ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని గ్రామస్తులు అన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే తెలపాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ జెండాను తొలగించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ గ్రామంలో రాజకీయ కక్షలు లేవని, ప్రశాంతంగా ఉన్న గ్రామంలో గొడవలకు ఆజ్యం పోసే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. దీంతో స్టేషన్‌కు వచ్చి పెద్ద సార్‌తో మాట్లాడాలని కానిస్టేబుళ్లు తెలపడంతో తామేమీ నేరం చేశామని స్టేషన్‌కు రమ్మంటున్నారని, జెండాను తొలగించేది లేదని తెగిసే చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు.


