కేబుల్ అపహరణ
యాడికి: మండలంలోని చందన గ్రామంలో వ్యవసాయ బోరు బావుల్లోని మోటార్లకు అమర్చిన విద్యుత్ కేబుల్‌ను సోమవారం రాత్రి దుండగులు అపహరించారు. గ్రామానికి చెందిన రైతులు పరమేశ్వర, శివయ్య, ఆది, మోహన గౌడ్ తమకున్న 15 ఎకరాల్లో అరటి, మొక్కజొన్న సాగు చేశారు. ఈ క్రమంలో బోరుబావులకు 80 మీటర్ల పొడవైన విద్యుత్ కేబుల్‌ను అమర్చారు. మంగళవారం ఉదయం పొలాల వద్దకెళ్లిన రైతులు కేబుల్ కనిపించకపోవడంతో చోరీ అయినట్లుగా నిర్ధారించుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10,. నవంబర్ 18న కూడా కేబుల్‌ను దుండగులు అపహరించుకెళ్లారని, తాజాగా మరోసారి కేబుల్‌ను ఎత్తుకెళ్లారంటూ రైతులు వాపోయారు. ఘటనపై పోలీసులు స్పందించి కేబుల్ దొంగల అరాచాకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
ఇసుక ట్రాక్టర్ల సీజ్
పెద్దవడుగూరు: మండలంలోని కొండూరు గ్రామ సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. అందిన సమాచారం మేరకు మంగళవారం తనిఖీలు చేపట్టిన సమయంలో కొందరు అక్రమంగా కొండూరు, వీరన్నపల్లి, చిట్టూరు గ్రామాల పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించి, రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి మండల మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరుపరిచినట్లు వివరించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పామిడి: ఈ నెల 22న 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో గాయపడి అనంతపురంలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పామిడి మండలం పొగరూరు నివాసి సంజీవ (39) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ మేరకు ఎస్‌ఐ బి.రవిప్రసాద్ తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


