పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించాలి
● వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు
గుత్తి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల కాలంలో పాస్టర్లకు గౌరవ వేతనం అందకుండా పోయిందని, ఇప్పటికై నా పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించాలంటూ వైఎస్సార్‌సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు డిమాండ్ చేశారు. గుత్తిలోని చర్చిలో మంగళవారం ఆయన పాస్టర్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా ప్రతి నెలా పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందజేస్తూ వచ్చారని గుర్తు చేశారు. అంతే కంటే ఎక్కువ ఇస్తానని ఎన్నికల సమయంలో వాగ్ధానం చేసిన చంద్రబాబు... ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. రెండేళ్లు కరోనాలో గడిచి పోయినా కేవలం మూడేళ్లలో సంక్షేమం, అభివృద్ది అంటే ఏమిటో వైఎస్ జగన్ చూపించారన్నారు. ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొస్తే వాటిని నిర్వహించడం చేతకాక చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి పూనుకోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికై నా పాస్టర్లకు వెంటనే గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు జాకోబ్ , అబ్రహాం, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.


