క్రీడలతో మానసికోల్లాసం
● సమగ్రశిక్ష ఏపీసీ శైలజ
అనంతపురం సిటీ: క్రీడలతో మానసికోల్లాసం కలిగి విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని సమగ్రశిక్ష(ఎస్‌ఎస్‌ఏ) ఏపీసీ శైలజ అభిప్రాయపడ్డారు. అనంతపురంలోని బాలుర ఉన్నత పాఠశాల (న్యూ టౌన్) మైదానంలో రెండ్రోజులుగా సాగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీ శైలజ హాజరై, మాట్లాడారు. విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా క్రీడలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. కాగా, చివరి రోజు కళ్యాణదుర్గం, అనంతపురం డివిజన్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 79 పరుగులు చేయగా, కళ్యాణదుర్గం జట్టు 11 ఓవర్లలో 83 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది. 25 పరుగులు చేసిన ప్రవీణ్ (కళ్యాణదుర్గం) ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌గా ఎంపిక చేశారు. అలాగే త్రోబాల్ పోటీల్లో గుంతకల్లు డివిజన్ జట్టు కళ్యాణదుర్గం, అనంతపురం జట్ల మీద విజయం సాధించి విజేతగా నిలిచింది. గుంతకల్లు డివిజన్‌లో లక్ష్మి బెస్ట్ ఆఫ్ ప్లేయర్‌గా నిలిచారు. విజేతలకు ట్రోఫీలు, మెమొంటోలను ఏపీసీ శైలజ అందజేశారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు.


