అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న భూసంరక్షణ విభాగం (సాయిల్ కన్సర్వేషన్) జూనియర్ అసిస్టెంట్ బి.హసీనాపై పోలీసు కేసు నమోదుకు జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. క్రమశిక్షణా రాహిత్యం, మోసం, చెక్కుల దుర్వినియోగా నికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై జూనియర్ అసిస్టెంట్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారు.
వివరాలు... ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తమతో హసీనా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు కలెక్టరేట్‌తో పాటు జేడీఏ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై గుత్తి ఏడీఏ ఎం.వెంకటరాముడు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. కలెక్టరేట్‌లో పనిచేస్తున్నానంటూ నమ్మించి రూ.లక్షలకు లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బాధితుల నుంచి ఒత్తిళ్ల పెరగడంతో జూనియర్ అసిస్టెంట్ హసీనా తన కార్యాలయంలో డిపార్ట్‌మెంట్‌కు చెందిన 15 చెక్కులను ఫోర్జరీ చేసి బాధితులకు చూపిస్తూ వస్తున్నట్లు కూడా గుర్తించారు.
ఈ క్రమంలోనే జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశాల మేరకు ఈనెల 12న జూనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీసు కేసు నమోదు చేయించాలని ఆ శాఖ డీడీ ఓబుళపతిని తాజాగా ఆదేశించారు. గురువారం ఆయన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరాలు అందించారు. అయితే కేసు నమోదు చేయలేదని తెలిసింది. ఓ జూనియర్ అసిస్టెంట్ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం, చెక్కులను వాడుకోవడంపై ఆ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
అనంతపురం సిటీ: మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు డీసీఈబీ గంధం శ్రీనివాసులు గురువారం తెలిపారు. ఈ నెల 30లోపు పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 నుంచి 5 వరకూ, రూ.200 రుసుముతో డిసెంబర్ 6 నుంచి 10 వరకూ, రూ.500తో అదే నెల 11 నుంచి 15వ తేదీలోపు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
రూ.1.30 కోట్ల ఆర్థిక లావాదేవీలపై విచారణ
ఉరవకొండ: తెలంగాణలోని నాగర్‌కర్నూలులో రూ.1.30 కోట్ల ఆర్థిక లావాదేవీల వ్యవహారంపై అనుమానాస్పదంగా ఉన్న ఉరవకొండకు చెందిన మైనారిటీ ప్రముఖుడిని విచారణ చేసేందుకు గురువారం నాగర్‌కర్నూలు పోలీసులు వచ్చారు.అనుమానితుడిని స్థానిక పీఎస్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పలువురు మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నాయకుడిని ఎలా తీసుకెళతారంటూ పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. విచారణ కోసమే పిలుచుకొచ్చామని, ఎలాంటి కేసు నమోదు చేయలేదని నాగర్‌కర్నూలు పోలీసులు తెలపడంతో మైనారిటీలు శాంతించారు. తాము నాగర్‌కర్నూలుకు వచ్చి విచారణకు సహకరిస్తామని చెప్పడంతో పోలీసులు వెనుతిరిగారు.
దొంగలకు దేహశుద్ధి
యాడికి: మండలంలోని దైవాలమడుగు గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దొంగలకు రైతులు దేహశుద్ధి చేశారు. ఇటీవల యాడికి మండల వ్యాప్తంగా వ్యవసాయ పొలాల వద్ద కేబుల్ వైర్లు, ట్రాక్టర్లలో బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయి. దీంతో రైతులు రాత్రి వేళ పొలాల వద్ద కాపలా కాస్తున్నారు. పెద్దవడుగూరు మండల కేంద్రానికి చెందిన రఘు, రాజులు బుధవారం అర్ధరాత్రి దైవాలమడుగు సమీపంలోని కొండల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలివ్వడంతో దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దైవాల మడుగుకు చేరుకొని నిందితులను యాడికి పోలీసుస్టేషన్‌కు తరలించారు.


