● ఇద్దరి పరిస్థితి విషమం
● ‘పచ్చ’ నాయకులను కాపాడేందుకు పోలీసుల యత్నం
అనంతపురం సెంట్రల్: నగరంలో ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఎదుట అంబేడ్కర్ ఫ్లైఓవర్‌పై గురువారం రాత్రి టీడీపీ నాయకుల కారు ఇద్దరిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో పాతూరుకు చెందిన మహబూబ్‌పీరా కుమారుడు బాషా, ఆజాద్‌నగర్‌కు చెందిన రోహన్‌ఖాన్ కుమారుడు ఇబ్రహీం ద్విచక్రవాహనంపై రామ్‌నగర్ వైపు నుంచి నగరంలోకి వస్తున్నారు. అదే సమయంలో నగరంలో నుంచి రామ్‌నగర్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు అతివేగంగా ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో ఎగిరి కిందపడిన బాషా, ఇబ్రహీం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసుల తీరుపై విమర్శలు..
ఇటీవల ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమితులైన వెంకటప్ప, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు లక్ష్మినారాయణ, సీనియర్ నాయకుడు రాయల్‌మురళీ కారులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో స్థానికులు ప్రశ్నిస్తే వారిపై టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగినట్లు తెలిసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడేసరికి అక్కడి నుంచి జారుకున్నారు. వారిని కాపాడేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నాలు చేయడం, ప్రమాదంలో వారి తప్పేమీ లేదని ట్రాఫిక్ సీఐ వెంకటేష్‌నాయక్ చెప్పడం విమర్శలకు దారి తీసింది. తొలుత కారులో టీడీపీ నాయకులు ఎవరూ లేరని చెప్పిన పోలీసులు.. ఘటనాస్థలంలో స్థానికులు తీసిన ఫొటోలు బయటకు రావడంతో చేసేది లేక కారులో టీడీపీ నేతలు ఉన్నారని చెప్పడం గమనార్హం. కారులో ప్రయాణిస్తున్న వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయలేదని, కేవలం ఘటనలో గాయపడిన వారికి మాత్రమే చేసినట్లు తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడిన ఇబ్రహీం, బాషా
బైకును ఢీకొన్న టీడీపీ నేతల కారు
బైకును ఢీకొన్న టీడీపీ నేతల కారు


