ప్రశాంతి నిలయం: సాయి నామం.. మధురగానాలతో పర్తిక్షేత్రం ఆధ్యాత్మిక అనుభూతులు పంచుతోంది. దేశ విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన అశేష భక్తజనం మధ్య సత్యసాయి శత జయంత్యుత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ సంగీత విద్యాంసులు సాయీశ్వరున్ని కీర్తిస్తూ కచేరీలు నిర్వహిస్తుండగా..భక్తులు తన్మయత్వం చెందుతున్నారు.
సత్యసాయి సేవా సంస్థల అంతర్జాతీయ సదస్సులో భాగంగా గురువారం సాయంత్రం సత్యసాయి సేవా సంస్థల బృందం సభ్యులు ‘సత్యసాయి రాగమాల’ పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయి అవతార వైభవం.. ఆయన చూపిన మార్గాన్ని చక్కటి గీతాలతో వినిపించారు. సంగీత కళాకారులతో భక్తులు కూడా గొంతు కలపడంతో సభా మందిరం సత్యసాయి నామంతో మార్మో గింది. అనంతరం వారంతా సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
అట్టహాసంగా సేవా సంస్థల జాతీయ సదస్సు
గురువారం ఉదయం సత్యసాయి సేవా సంస్థల 11వ జాతీయ సదస్సును అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తొలుత సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులనుద్దేశించి ప్రసంగించారు.


