బాబు పాలనపై ప్రజా తిరుగుబాటు తప్పదు
ఉరవకొండ: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సీఎం చంద్రబాబు సాగిస్తున్న దుర్మార్గపు పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం స్థానిక బాలాజీ థియేటర్ సర్కిల్ వద్ద నిర్వహించిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమంలో విశ్వ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే సీఐ సతీష్‌కుమార్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. పరకామణి కేసులో వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు చెప్పాలని ఆయన్ను ప్రభుత్వ పెద్దలు మానసికంగా వేధించారన్నారు. ఈ విషయంపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడినందుకు ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి రోజంతా తిప్పి కోర్టులో హాజరుపరిచారన్నారు. దీనిపై న్యాయస్థానం పోలీసులకు చీవాట్లు పెట్టి బెయిల్ మంజూరు చేసిందన్నారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను సీఎం చంద్రబాబు కించపరుస్తూ మాట్లాడటంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, కర్షక లోకం తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతూ ముఖ్యమంత్రి వాఖ్యలను ఖండిస్తున్నాయని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం చురుగ్గా అడుగులు వేస్తోందని, ఇప్పటికే మిట్టల్ సంస్థకు అప్పగించాలని చూస్తోందన్నారు.
రాష్ట్రం దూసుకెళ్తోంది అప్పుల్లోనే..
సంపద సృష్టిస్తామంటూ అధికారం చేపట్టిన చంద్రబాబు నేడు అప్పులు చేయడంలో దూసుకెళ్తున్నారని ‘విశ్వ’ విమర్శించారు. అప్పులు అడుక్కుని వచ్చేందుకు ఆర్థిక మంత్రిగా కేశవ్‌ను ఏర్పాటు చేసుకున్నారన్నారు. ‘కాగ్’ నివేదిక ప్రకారం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 వేల కోట్లు అప్పులు చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం 17 నెలల కాలంలోనే 2 వేల కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని స్వయంగా ‘కాగ్’ తన నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీఐ సతీష్‌కుమార్‌ది
ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజం


