కుందుర్పి: మండల కేంద్రానికి చెందిన టీడీపీ నేత దొమ్మర మారెప్ప తన ఇంటి నిర్మాణం కోసం పురాతన విగ్రహాలున్న బండరాళ్లను గురువారం ధ్వంసం చేశాడు. ట్రాక్టర్లను ఏర్పాటు చేసి బండరాళ్లను ధ్వంసం చేస్తుండగా చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. ధ్వంసమైన గుండ్లపై అత్యంత ప్రాచీన దేవతామూర్తుల విగ్రహాలు చెక్కిన విషయాన్ని గుర్తించారు. కాగా, గతంలో పలుమార్లు పురావస్తు శాఖ అధికారులు సైతం వీటిని పరిశీలించారు. వీటిపై ప్రత్యేకంగా అధ్యయనం కొనసాగుతోంది. తహసీల్దార్ ఓబులేసు హెచ్చరికలతో టీడీపీ నేత పనులు నిలిపి వేశారు.
‘దుర్గం’లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
కళ్యాణదుర్గం: నియోజకవర్గ కేంద్రంలో రెండు మతాల మధ్య వివాదం తలెత్తింది. పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలో రెండు రోజులుగా మసీదుల్లో ముస్లింలు మిలాద్–ఉన్–నబీ ప్రార్థనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9.30 నుంచి 10 గంటల వరకు మారెంపల్లి కాలనీలో ఉన్న మసీదులో ప్రార్థనలు జరిగాయి. ఆ సమయంలో మైకు శబ్దాన్ని తగ్గించాలని స్థానిక యువకులు సూచించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ యువరాజు సంఘటన స్థలానికి వెళ్లి సర్దిచెప్పారు. అనంతరం ఇరు మతాల పెద్దలను పోలీసుస్టేషన్‌కు పిలిపించి చర్చలు జరిపారు. శాంతి సామరస్యంగా సోదరభావంతో మెలగాలని సూచించారు.
చిరుత దాడిలో మేక మృతి
కళ్యాణదుర్గం: స్థానిక మున్సిపాల్టీ పరిధిలోని దొడగట్ట గ్రామ శివారున ఓ రైతుకు చెందిన మేకను ఓ చిరుత లాక్కెళ్లి తినేసింది. మేకలను మేపు కోసం సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లినప్పుడు తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానిక రైతులు వాపోయారు. బుధవారం ఓ మేక పోతును లాక్కెళ్లి చంపి తింటుండడం గమనించిన రైతులు కేకలు వేయడంతో చిరుత పారిపోయింది. ఇప్పటికై నా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతలను బంధించాలని పలువురు కోరుతున్నారు.