
విద్యుత్ చార్జీలపై మరో ఉద్యమం
అనంతపురం అర్బన్: బషీర్‌బాగ్ అమరుల స్ఫూర్తితో విద్యుత్ చార్జీలపై మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ ఉద్యమానికి గురువారంతో పాతికేళ్లు పూర్తయిన నేపథ్యంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద ‘ప్రతిజ్ఞ దినం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకగా పోరాటాలకు సిద్ధం కావాలంటూ ఈ సందర్భంగా నాయకులు పిలుపునిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేంద్రకుమార్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమెక్రసీ నాగరాజు, సీపీఐ ఎంఎల్ చంద్రశేఖర్, ఎస్‌యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర మాట్లాడారు. 2000లో ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గి నాటి సీఎం చంద్రబాబు భారీగా విద్యుత్ చార్జీలు పెంచారని గుర్తు చేశారు. ఈ ప్రజా వ్యతిరేక చర్యను నిరసిస్తూ చలో అసెంబ్లీ నినాదంతో వామపక్ష పార్టీలు చేపట్టిన ప్రదర్శనపై బషీర్‌బాగ్ వద్ద పోలీసులు కాల్పులకు తెగబడడంతో నాయకులు బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి అసువులు బాసారన్నారు. ప్రస్తుతం అదే సీఎం చంద్రబాబు మరోసారి రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపారన్నారు. అంతటితో ఆగకుండా మరో 12,717 కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సర్దుబాటు చార్జీల రద్దు, స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు నిలిపివేత, విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిస్తున ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.