
రిజిస్ట్రేషన్ శాఖ
అక్రమ రిజిస్ట్రేషన్లతో భూవివాదాలకు ఆజ్యం పోసిన సబ్ రిజిస్ట్రార్
ఆస్రా ఆస్పత్రి డబుల్ రిజిస్ట్రేషన్ వివాదం సద్దుమణగకనే మరొకటి వెలుగులోకి
అనంతపురంలోని తపోవనం పరిధిలో రూ.కోట్లు విలువైన భూమికి డబుల్ రిజిస్ట్రేషన్
సబ్ రిజిస్ట్రార్ రమణరావు తీరుతో భూ యజమానుల్లో బెంబేలు
అనంతపురం టౌన్: జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్‌లో ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యాలయంలో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న రమణరావు లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఒకే స్థిరాస్థికి డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ భూ వివాదాలకు ఆజ్యం పోసిన తీరు కాకరేపుతోంది. అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న ఆస్రా ఆస్పత్రి భవనానికి డబుల్ రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ భవనాన్ని తొలుత కొనుగోలు చేసిన వ్యక్తులు... రమణరావు అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే తపోవనంలో 5వ రోడ్డుకు చెందిన బుడబుక్కల సామాజిక వర్గానికి చెందిన భూములను సైతం అమరనాథ్ చౌదరి, పురుషోత్తమనాయుడుకు డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కట్టబెట్టిన వైనమూ వెలుగు చూసింది. దీంతో బాధితులు వామపక్ష పార్టీ నాయకులను ఆశ్రయించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన ఘటన మరువక ముందే ఎ.నారాయణపురంలో చోటు చేసుకున్న మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
రూ.కోట్లు విలువ చేసే భూమికి డబుల్ రిజిస్ట్రేషన్
ఎ.నారాణపురం గ్రామ పొలంలో రూ.కోట్లు విలువ చేసే భూమికి సైతం డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 156–2లో 9.59 ఎకరాల భూమిని యజమాని ఈ.పెద్ద నారప్ప దశల వారీగా 1999లో 3 ఎకరాలు, 2002లో 2.40 ఎకరాలు, 2008లో 5ఎకరాల భూమిని విక్రయించాడు. దీంతో చివరకు పెద్ద నారప్పకు ఒక్క సెంట్ భూమి కూడా మిగల్లేదు. అయితే తాజాగా వారసులమంటూ కొంత మంది వ్యక్తులు వంశ వృక్షాన్ని సృష్టించుకొని తెరపైకి వచ్చారు. సర్వే నంబర్ 156–2లో వారసత్వంగా వారికి ఎలాంటి ఆస్తి సంక్రమించక పోయినా సబ్ రిజిస్ట్రార్ రమణరావును ప్రసన్నం చేసుకుని 1.19సెంట్ల స్థలాన్ని కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల గ్రామానికి చెందిన ముకుందనాయుడు, అతని భార్య పద్మాగీత పేరిట ఈ నెల 6న రిజిస్ట్రేషన్ చేశారు. లేని భూమిని ఉన్నట్లుగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు తాజాగా ఆ భూమిలో ఈ స్థలం మాదేనంటూ బోర్డులు సైతం నాటారు. దీంతో గతంలో భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
రికార్డు పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్
వ్యవసాయ భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో 1బీ, అడంగల్ తదితర రికార్డులతో పాటు ఈసీలను తొలుత పరిశీలించాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా రూ.కోట్లు విలువ చేసే భూమిని ఎలాంటి వారసత్వ రికార్డు లేని వ్యక్తులతో కుమ్మకై ్క భారీగా దండుకొని డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం వివాదానికి తెరతీసింది. చదరపు గజాల కింద చలానాలు కట్టించి అత్యంత విలువైన 1.19 ఎకరాల భూమిని మరో వ్యక్తికి కట్టబెట్టడం వెనుక పెద్ద మొత్తంలో నగదు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఈ ప్రక్రియలో సబ్ రిజిస్ట్రార్ రమణరావుకు భారీగానే డబ్బు ముట్టినట్లు తెలుస్తోంది. అనంతపురంలోని అత్యంత విలువైన భూములకు డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ భూ వివదాలకు ఆజ్యం పోస్తున్నట్లుగా ఆయనపై ఆరోపణలున్నాయి.

నారాయణపురంలో బోర్డు నాటిన దృశ్యం