
కుప్పంపై ఉన్న ప్రేమ.. ‘దుర్గం’పై లేదా?
● నెలల వ్యవధిలోనే కుప్పం ప్రాంతానికి నీటిని తరలించామంటున్నారు
● 16 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేకపోయారు
● ‘దుర్గం’ ఎమ్మెల్యే అమిలినేనిపై వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త రంగయ్య ధ్వజం
కుందుర్పి: రేయింబవళ్లు పని చేసి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకెళ్లినట్లు ప్రకటనలు ఇస్తున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, ఎస్సార్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత అమిలేని సురేంద్రబాబు.. తన సొంత నియోజకవర్గంలోని చెరువులను ఎందుకు నింపలేకపోయారని వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య నిలదీశారు. కుందుర్పి మండలం మహంతపురం, కదరంపల్లి గ్రామాల మధ్య బీటీపీ కాలువను మండల నాయకులు, రైతులతో కలసి గురువారం ఆయన పరిశీలించారు. అంతకు ముందు గంటపాటు కాలువలో బైఠాయించి నిసరన తెలిపారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడారు. కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించేందుకు అక్కడి ఎమ్మెల్యే చంద్రబాబు 150 భారీ యంత్రాలను ఏర్పాటు చేశారని, కేవలం నెలల వ్యవధిలోనే అనంతపురం జిల్లా మీదుగా కృష్ణా జలాలను కుప్పం ప్రాంతానికి తరలించారని గుర్తు చేశారు. అయితే ఈ పనులు పూర్తి చేసింది ఎస్సార్ కన్‌స్ట్రక్షన్స్ అధినేతయైన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబేనన్నారు. నియోజకవర్గ ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టిన బీటీపీ ప్రాజెక్ట్ పనులను ఏడేళ్లు గడిచినా సదరు కాంట్రాక్టర్, ఎమ్మెల్యే అమిలినేని నేటికీ పూర్తి చేయలేకపోయారన్నారు. కుప్పం మీద ఉన్న అభిమానం కళ్యాణదుర్గం మీద ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. జిల్లా రైతులకు అన్యాయం చేస్తూ హంద్రీనీవాకు లైనింగ్ పనుల ద్వారా కుప్పంలోని 110 చెరువులను నీటితో నింపే పనులను మాత్రం ఆగమేఘాలపై పూర్తి చేశారని ధ్వజమెత్తారు.
జగనన్న ప్రభుత్వంలోనే పరిహారం
బీటీపీ కాలువ నిర్వాసిత రైతులకు జగనన్న ప్రభుత్వంలోనే పరిహారం అందిందని తలారి రంగయ్య గుర్తు చేశారు. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పైసా పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. పరిహారం కింద బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన రూ,110 కోట్లు ఏమయ్యాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కమలా నాగరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు కె.హనుమంతరాయుడు, గొళ్ల సూరి, జి.హనుమంతరాయుడు, చంద్రశేఖర్, పాలాక్షి, మందలపల్లి భీమప్ప, సర్పంచులు రామ్మూర్తి, గంగాధర, విజయ్, మాజీ జెడ్పీటీసీ రాజగోపాల్, ఎంపీటీసీ ఈరన్న, బీటీ రాము, బెస్తరపల్లి బాబు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.