
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ‘అనంత’ ఆతిథ్యం
అనంతపురం కల్చరల్: రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ యోగా పోటీలు ఈ ఏడాది నవంబర్‌లో జిల్లాలో నిర్వహించనున్నట్లు వివేకానంద యోగా కేంద్రం అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇటీవల తాడేపల్లిలో జరిగిన యోగా పోటీల్లో జిల్లాకు చెందిన యోగాభ్యాసకులు మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించి, సెప్టెంబర్ 11న భిలాయ్‌లో, అదే నెలలో 27న విజయవాడలో జరిగే జాతీయ స్థాయిలో యోగా పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభ చాటిన యోగాభ్యసకులను గురువారం అనంతపురంలోని షిరిడినగర్ వివేకానంద యోగ భవన్‌లో సత్కరించారు. ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో యోగా గురువులు దివాకర్, పుల్లయ్య, మారుతీప్రసాద్, తారక్, నాని నవోమిన్ పాల్గొన్నారు.
పంచాయతీ పురోగతి సూచికపై నేడు శిక్షణ
అనంతపురం సిటీ: అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్‌లోని డీపీఆర్‌సీ భవన్‌లో ‘పంచాయతీరాజ్ పురోగతి సూచిక 1.0’ అనే అంశంపై ఒక రోజు శిక్షణ తరగతులు శుక్రవారం నిర్వహించనున్నట్లు శిక్షణ కేంద్రం జిల్లా మేనేజర్ నిర్మల్ దాస్ గురువారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీ సభ్యులు, ఐసీడీఎస్ అధికారులు, డీడీఓలు, డీఎల్‌పీఓలు, ఇంకా పలు శాఖల అధికారులు హాజరవుతారన్నారు. కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులు ప్రారంభిస్తారని వెల్లడించారు. సీఈఓ, డిప్యూటీ సీఈఓ కూడా పాల్గొంటారని వివరించారు.
స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు
రాప్తాడు రూరల్: బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు..అనంతపురం రూరల్ మండలం నందమూరినగర్‌కు చెందిన గోవిందప్ప కుమారుడు కృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. బుధవారం అర్ధరాత్రి సమయంలో నందమూరినగర్ నుంచి పిల్లిగుండ్లకాలనీకి బైకుపై వెళుతుండగా నరిగిమ్మ ఆలయం దాటిన తర్వాత ఎదురుగా రాంగ్‌రూట్‌లో వచ్చిన బొలెరో వాహనం ఢీ కొంది. ఘటనలో కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతిలోని స్విమ్స్‌కు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.