
బెల్ట్, పర్మిట్ షాపులను రద్దు చేయాలి
అనంతపురం కార్పొరేషన్: బెల్ట్, పర్మిట్ షాపులను రద్దు చేయకపోతే ఆందోళనలు చేపడుతామని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి హెచ్చరించారు. జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎక్కడైనా సంక్షేమాన్ని అందించే ప్రభుత్వాలు ఉంటాయి కానీ, రాష్ట్రంలో మాత్రం మద్యం బాగా తాగండి.. ఊగండి, జీవితాలను నాశనం చేసుకోండి అనే విధంగా ప్రభుత్వ వైఖరి ఉందని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 43 వేల బెల్టు షాపులను రద్దు చేసి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో మాత్రమే అనుమతిస్తున్నట్లుగా ప్రకటించి సీఎం చంద్రబాబు తన కుటిల బుద్ధిని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు శోభారాణి, భారతి, ప్రసన్న, మహేశ్వరి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం డిమాండ్