ఒక్క పథకమైనా అమలు చేశారా?
బుక్కరాయసముద్రం: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం మండలలోని దయ్యాలకుంటపల్లిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ కల్లబొల్లి మాటలతో ప్రజలను చంద్రబాబు మభ్య పెడుతున్నారన్నారు. హామీలు అమలు చేయకుండా అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను పీడిస్తున్నారన్నారు. హామీల అమలుపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావడానికి లక్ష్యంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 4న నిర్వహించే ర్యాలీలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వెన్నుపోటుకు ఆద్యుడు బాబు
రాజకీయాల్లో వెన్నుపోటుకు ఆద్యుడిగా చంద్రబాబు పేరుగాంచారని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. సూపర్‌సిక్స్ హామీలు నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎవరికీ శాశ్వతం కాదనే విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలు త్వరలోనే ఆయనకు తగిన గుణం పాఠం చెబుతారన్నారు. చంద్రబాబు మోసాలకు నిరసనగా నార్పలలో ఈ నెల 4న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, బీకేఎస్ జెడ్పీటీసీ భాస్కర్, సత్య నారాయణరెడ్డి, నారాయణరెడ్డి, నార్పల ఎంపీపీ నాగేశ్వరరావు, రాఘవరెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, గోకుల్‌రెడ్డి, చామలూరు రాజగోపాల్, నాగలింగారెడ్డి, ప్రసాద్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబు మోసాలను నిరసిస్తూ ఈ నెల 4న వెన్నుపోటు దినం
నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్


