అబద్ధాల ప్రచారమేంటి లోకేష్?
అనంతపురం కార్పొరేషన్: ‘మంత్రి నారా లోకేష్ దావోస్‌లో ఒప్పందం చేసుకోవడం కారణంగానే జిల్లాకు సోలార్ ప్లాంట్, ఏపీ జెన్‌కో అండ్ ఎన్‌హెచ్‌పీసీ 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్ట్ వచ్చాయని, కూటమి ప్రజాప్రతినిధులు చెప్పుకుంటున్నారు. ఈ అబద్ధాల ప్రచారమేంటి లోకేష్? గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టుకు ఇప్పుడు శంకుస్థాపన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. శనివారం ఆమె అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంధన రంగంలో జగనన్న అత్యుత్తమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ఫలితంగా రూ.22,302 కోట్ల పెట్టుబడులు, 5,300 మందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీకి గత ప్రభుత్వంలో నాంది పలికిన అంశానికి సంబంధించి పత్రికా కథనాలను చూపించారు. రెండ్రోజుల అనంత పర్యటనలో మంత్రి లోకేష్ ప్రజా సమస్యలపై ఎందుకు నోరుమెదపలేదో చెప్పాలన్నారు. ఇటీవల అనంతపురం జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఎన్ డిగ్రీ కళాశాలలో ఎలుకల వల్ల ఇబ్బంది పడ్డ విద్యార్థులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. కక్ష సాధింపులో భాగంగానే లిక్కర్ స్కాం పేరుతో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌లను అరెస్టు చేశారన్నారు. దొంగ సాక్ష్యాలతో సంబంధం లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మహిళలపై దౌర్జన్యాలు, బెదిరింపులు జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, నాయకురాళ్లు సుజాత, ఉష, భారతి, దేవి, తదితరులు పాల్గొన్నారు.
జగనన్న తెచ్చిన ప్రాజెక్టులకు
శంకుస్థాపన చేస్తున్నారు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల


