అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం చేకూరుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి అధ్యక్షతన బుధవారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డీలిమిటేష్‌న్‌లో భాగంగా జనాభా ప్రాతిపదికన పార్లమెంట్‌లో సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు కేవలం 29 పెరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు 129 పెరుగుతాయన్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు గణనీయంగా తగ్గుతాయన్నారు. అలాగే పార్లమెంట్‌లో చట్టాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం తగ్గి, రూపొందే చట్టాల వల్ల ఇక్కడి ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయ దాడిని ఎదుర్కొనేందుకు తిరుగుబాటు బాటను ఎంచుకున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా కాకుండా ఐక్యతతో ఉండేలా కేంద్రం వ్యవహరించాలన్నారు. అలాగే రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకూ పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, కార్యదర్శివర్గ సభ్యులు సంజీవప్ప, శ్రీరాములు, రామకృష్ణ, గోపాల్, కేశవరెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.