
ఆధిపత్యం.. ‘అధికార’ పైత్యం
బొమ్మనహాళ్/ శింగనమల/ బ్రహ్మసముద్రం : ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామసభలను అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తమ ఆధిపత్య ప్రదర్శనకు వేదికలుగా మార్చేశారు. గ్రూపులుగా విడిపోయిన చోట్ల నాయకులు ఫర్నీచర్‌ను విసిరి కొట్టి.. అధికారులను నోటికొచ్చినట్టు దూషించారు. అధికారంలో కూటమి సర్కారు ఉందని.. తాము చెప్పినట్టే ఏ అధికారి అయినా నడుచుకోవాలని హుకుం జారీ చేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీలు/సచివాలయాల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో సర్పంచ్ పరమేశ్వర, అధికారుల సారథ్యంలో ఏర్పాట్లు చేయగా.. టీడీపీ నాయకులు హనుమంతు అలియాస్ వట్టెప్ప, తిప్పేస్వామి అక్కడికి చేరుకుని హంగామా చేశారు. తమ అనుమతి లేకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారంటూ కుర్చీలను కాళ్లతో తన్ని రోడ్డుపైకి విసిరేశారు. అడ్డుకోబోయిన గ్రామ సభ స్పెషలాఫీసర్, మండల ఇంజినీర్ జగదీష్, మహిళా సంరక్షణ కార్యదర్శి వరలక్ష్మీలపై నోరుపారేసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోయింది కదా.. మా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనాల్సిన అవసరం నీకేముందంటూ సర్పంచ్ పరమేశ్వరతో వాగ్వాదానికి దిగారు. ఘటనపై సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
● శింగనమల మండలం ఆకులేడు గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహణ కోసం టీడీపీ నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. దీంతో ఇరు వర్గాల వారికీ తహసీల్దార్ బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది నచ్చజెప్పారు. అయినా ఒక దశలో పరస్పర దాడులు చేసుకోవడానికి సిద్ధమవగా పోలీసులు సకాలంలో స్పందించి నిలువరించారు.
● బ్రహ్మసముద్రం మండలంలోని బ్రహ్మసముద్రం, భైరసముద్రం, వేపులపర్తి, పడమటి కోడిపల్లి తదితర గ్రామాల్లో జరిగిన ఉపాధి గ్రామ సభల్లో టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీనివాసులు అధికారులపై విరుచుకుపడ్డారు. తమ పార్టీ చెప్పినట్టే నడుచుకోవాలని.. గత ప్రభుత్వంలో మాదిరిగా అయితే కుదరదని.. అధికారులు పద్ధతి మార్చుకోవాలని గట్టిగా హెచ్చరించారు.
గ్రామసభలే వేదికలు
మేం చెప్పినట్టే వినాలంటూ టీడీపీ నేతల హుకుం