
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
అనంతపురం అగ్రికల్చర్: బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రభుత్వానికి, పశుసంవర్దకశాఖకు మంచిపేరు తీసుకురావాలని నూతన విలేజ్ అనిమల్ హస్పెండరీ అసిస్టెంట్ల (వీఏహెచ్‌ఏ)కు పశుశాఖ జేడీ డాక్టర్ వై.సుబ్రహ్మణ్యం సూచించారు. ఆర్‌బీకే వేదికగా రైతులకు నాణ్యమైన సేవలందించాలన్నారు. కొత్తగా నియమితులైన 280 మంది వీఏహెచ్‌ఏలకు ఏప్రిల్ 1 నుంచి నిర్వహిస్తున్న 45 రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక పశుశాఖ జేడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి జేడీ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించిన 280 మందిని బ్యాచ్‌లుగా విభజించి అనంతపురం జేడీ కార్యాలయ ప్రాంగణంలో రెండు బ్యాచ్‌లు, సాయినగర్ పశువుల ఆస్పత్రిలో ఒక బ్యాచ్, రెడ్డిపల్లి ప్రాంతీయ పశుశిక్షణా కార్యాలయంలో రెండు బ్యాచ్‌లు, సిద్ధరాంపురం పశుగ్రాస క్షేత్రంలో ఒక బ్యాచ్ చొప్పన ఆరు బ్యాచ్‌లకు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వడానికి 28 మంది అధికారులను నియమించామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ఆర్‌బీకే వేదికగా రైతులకు అందజేయాలన్నారు. పశు, జీవ సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన పశుశాఖ జేడీ, డీడీలు, ఏడీలు, పలువురు డాక్టర్లను ఈ సందర్భంగా జ్ఞాపికలు అందజేసి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీఏహెచ్‌ఏలు వారికి కేటాయించిన ప్రాంతాల్లో గురువారం పంచాయతీ కార్యదర్శులను కలసి రిపోర్టు చేసుకుని విధుల్లో చేరాలని ఆదేశించారు. కార్యక్రమంలో పశుశాఖ డీడీలు డాక్టర్ వై.రమేష్‌రెడ్డి, డాక్టర్ జి.వెంకటేష్, కోర్సు కో ఆర్డినేటర్లు, రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి, పశుశాఖకు మంచిపేరు తీసుకురండి
వీఏహెచ్‌ఏల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పశుశాఖ జేడీ సుబ్రహ్మణ్యం