
కనగానపల్లి: రాప్తాడు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విజయం తథ్యమని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి తరఫున తల్లిదండ్రులు తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి, ప్రేమకుమారి, సోదరులు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డితో కలసి నామినేషన్ పత్రాలను ఆయన దాఖలు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... శుభ దినం కావడంతో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తరఫున తొలి సెట్ నామినేషన్ దాఖలు చేశామన్నారు. ఈ నెల 24న నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీతో తరలివచ్చి ప్రకాష్‌రెడ్డి మరోసెట్ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం ముందు ఎన్‌డీఏ కూటమి పటాపంచలు కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు గువ్వల అంజనాదేవి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు ధనుంజయ్‌యాదవ్, ఎంపీపీ జయలక్ష్మి వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, పార్టీ కన్వీనర్ జూటూరు శేఖర్, బీసీ సెల్ నాయకుడు పసుపుల ఆది, నాయకులు చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, నసనకోట ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్