భార్య మాట్లాడకుండా మౌనం.. భర్త బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

భార్య మాట్లాడకుండా మౌనం.. భర్త బలవన్మరణం

Dec 19 2023 1:38 AM | Updated on Dec 19 2023 11:52 AM

- - Sakshi

భార్య మాట్లాడకుండా మౌనం వహించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు...

అనంతపురం: భార్య మాట్లాడకుండా మౌనం వహించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి గ్రామానికి చెందిన వంశరాజుల రామన్న కుమార్తె లక్ష్మికి ఉరవకొండకు చెందిన మారన్న పెద్ద కుమారుడు మల్లికార్జున (26)తో 2020లో వివాహమైంది. వీరికి 8 నెలల వయసున్న కుమార్తె ఉంది. ఎలక్ట్రికల్‌ పనులతో పాటు వెహికల్‌ డ్రైవింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడడంతో మానేయాలని భార్య కోరింది. సరేనంటూ అంగీకరించిన మల్లికార్జున అప్పుడప్పుడు మద్యం తాగి ఇంటికి చేరుకునేవాడు.

ఈ నెల 13న భర్తతో కలసి యాడికిలోని పుట్టింటికి లక్ష్మి వచ్చింది. మూడు రోజుల పాటు ఎంతో సరదాగా గడిపారు. ఆదివారం సాయంత్రం మల్లికార్జున మద్యం సేవించి ఇంటికి చేరుకోవడంతో పుట్టింటి వారి ముందు తన పరువు పోయిందంటూ లక్ష్మి బాధపడింది. తన భర్త గురించి ఎంతో మంచిగా తల్లిదండ్రులతో చెప్పుకున్నానని, ఈ రోజు తాగి వచ్చి పరువు తీశావంటూ మదనపడుతూ తనతో మాట్లాడవద్దంటూ మౌనం దాల్చింది. దీంతో మనస్తాపానికి గురైన మల్లికార్జున అదే రోజు రాత్రి 10 గంటలకు తండ్రి మారన్నకు ఫోన్‌ చేసి లక్ష్మి తనతో మాట్లాడడం లేదని, ఇక తాను బతికి ఉండడం వృథాగా భావించి ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. వెంటనే కోడలికి మారన్న ఫోన్‌ చేసి విషయం తెలపడంతో రామన్న కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు.

చివరకు ఇంటి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ కట్టడంలో లుంగీతో వేసుకున్న ఉరికి వేలాడుతున్న మల్లికార్జునను గమనించి, స్థానికుల సాయంతో కిందకు దించారు. కొన ఊపిరితో ఉండడం గమనించి వెంటనే ఓ ప్రైవేట్‌ వాహనంలో తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మల్లికార్జున మృతి చెందినట్లు నిర్ధారించారు. కోడలు ద్వారా సమాచారం అందుకున్న మారన్న కుటుంబసభ్యులు యాడికికి వచ్చి మల్లికార్జున మృతదేహంపై పడి బోరున విలపించారు. మృతుడి తండ్రి మారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గురుప్రసాదరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement