21 నుంచి గవిమఠం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ: కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. 28వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బ్రోచర్లను శనివారం గవిమఠం ఆవరణలో పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మఠం ఇన్‌చార్జ్ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న స్వామి వారి మహారథోత్సవం, 27న లంకాదహనం ఉంటాయన్నారు. కార్యక్రమంలో వీరశైవ సంఘం నాయకులు పాటిల్ నిరంజన్‌గౌడ్, పాటిల్ రాజశేఖర్, మఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దాం
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గవిమఠం చంద్రమౌశీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్ సూచించారు. శనివారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో గవిమఠం బ్రహ్మోత్సవాలపై దేవదాయ శాఖ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ అధ్యక్షతన అధికారులతో జరిగిన సమీక్షలో ఆర్డీఓ మాట్లాడారు. మహారథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు.


