పాముకాటు బాలునికి పునర్జన్మ
● సర్వజనాస్పత్రి పీడియాట్రిక్ వైద్యుల ఘనత
అనంతపురం మెడికల్: పాముకాటుకు గురై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఏడేళ్ల బాలునికి ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్‌నర్సులు ఊపిరి నిలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత మీడియాకు వెల్లడించారు. కళ్యాణదుర్గం మండలం ఇట్లంపల్లికి చెందిన లక్ష్మీకాంత్, లక్ష్మి దంపతుల కుమారుడు బన్నీ జనవరి 30న పాముకాటుకు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్చారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స ప్రారంభించారు. చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్‌దీన్‌కుమార్, డాక్టర్ సంజీవప్ప, తదితరులు యాంటీ స్నేక్ వీనమ్‌తో పాటు పలు రకాల యాంటీ బయాటిక్స్ ఇచ్చారు. దీంతో ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. బన్నీ పూర్తిగా కోలుకోవడంతో శనివారం వైద్యులు డిశ్చార్జ్ చేశారని వారు తెలిపారు.


