కీలక దశ.. మెలకువలతో లాభాల దిశ
● పూత దశలో మామిడి తోటలు
● యాజమాన్యం పాటించాలని అధికారుల సూచనలు
కళ్యాణదుర్గం/అనంతపురం అగ్రికల్చర్: ప్రస్తుతం మామిడి పంట పూత దశకు వచ్చింది. ఈ సమయంలో దిగుబడి పెంచుకోవడానికి కొన్ని మెలకువలు పాటిస్తే గణనీయమైన లాభాలు సాధించవచ్చు. కొమ్మలకు పూత వచ్చే ప్రస్తుత సమయంలో వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కొన్ని సమయాల్లో పూత వచ్చినప్పటికీ అది ముడుచుకుని పోయే ప్రమాదం ఉంది. సీజనల్ పూత పూర్తిగా రాకపోవడం కారణంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నాప్టలిస్ అసిటిక్ ఆమ్లాన్ని స్పిరిట్‌లో కరిగించి ఆ తర్వాత మంచినీటిలో కలిపి చెట్టు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. దీంతో కొమ్మలకు పూత సాగి పూలు విచ్చుకుని పిందెకట్టే అవకాశం అధికంగా ఉంటుంది.
సాగునీటి యాజమాన్యం...
మామిడి పూత సమయంలో తోటలకు నీటి తడులు చాలా అవసరం. పూత, మొగ్గ బయటపడే సమయంలో మామిడి తోటలకు తప్పనిసరిగా నీటిని అందించాల్సి ఉంటుంది. వేళ్ల నుంచి చివర కొమ్మ వరకు తడి అందేలా చేస్తే అన్ని కొమ్మలకు పూత సాగే అవకాశం ఉంటుంది. నీటిని అందించే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పదిహేనేళ్లు దాటని తోటలకు ఒకసారి (బాగా తేలిక నేలలైతే), వారం రోజుల తర్వాత మరోసారి నీరందించాలి. లేదంటే డ్రిప్ ద్వారా వారం రోజుల పాటు నీరు అందిస్తే ప్రయోజనం ఉంటుంది.
పిందె దశలో..
రబీలో ఆలస్యంగా కోతకు వచ్చే రకాల చెట్టుపై హోర్మోనులను పిచికారీ చేస్తే పూత, పిందె రాలడం బాగా తగ్గుతుంది. తెల్లపూత, జొన్న గింజ పరిమాణంలో పిందెలు ఉన్నప్పుడు 200 లీటర్ల నీటిలో 4 గ్రాముల నాప్టలీన్ అసిటిక్ ఆమ్లం, దీనికి తోడు 400 గ్రాముల బోరాన్ కలిపి పూతపై పడేలా పిచికారీ చేసుకోవడం వల్ల పిందెకట్టే సమయంలో రాలడాన్ని నివారించవచ్చు. కాయ దశ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో పూతపై మాత్రమే తుంపర్లు పడే విధంగా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. పిందె పరిమాణం పెరుగుతన్న సమయంలో కూడా నీటిని అందిస్తూ మొదళ్లలో తడి ఆరకుండా చూడాలి.
కీలక దశ.. మెలకువలతో లాభాల దిశ


