ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లపై డెడ్‌లైన్‌ కత్తి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లపై డెడ్‌లైన్‌ కత్తి

Feb 8 2026 4:11 AM | Updated on Feb 8 2026 4:11 AM

ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లపై డెడ్‌లైన్‌ కత్తి

ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లపై డెడ్‌లైన్‌ కత్తి

సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా పనిచేస్తున్న రైతు సేవ కేంద్రాల్లో పనిచేసే సహాయకులు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకేసారి ఐదారు టాస్క్‌లు ఇచ్చి గడువులోపు పూర్తి చేయాలంటూ వారి మెడపై కత్తి పెట్టారు. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు ఉదయం ఏడింటికే ఇల్లు వదిలి క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా టార్గెట్‌ను చేరుకోలేకపోతున్నారు. ఈ నెల ఆఖరులోపు లక్ష్యాలన్నింటినీ సాధించాలంటూ వ్యవసాయశాఖ అధికారులు వాట్సాప్‌, టెలికాన్ఫరెన్స్‌లతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

అనంతపురం అగ్రికల్చర్‌: రైతు సేవ కేంద్రం (ఆర్‌ఎస్‌కే) అసిస్టెంట్లకు ఉద్యోగం కత్తిమీద సాముగా మారింది. వీరికి సాధారణంగా ఖరీఫ్‌లో మాత్రమే పనిభారం అధికంగా ఉంటుంది. రబీలో పెద్దగా పనిభారం ఉండదు. కానీ ఈసారి రబీ ఈ–క్రాప్‌ పెద్ద గుదిబండగా మారింది. యాప్‌లో 6.1 వర్షన్‌ కాకుండా 6.5 వర్షన్‌ సాప్ట్‌వేర్‌ మార్పు వల్ల గత ఖరీఫ్‌లో వేసిన పంటలతో పాటు రబీ పంటలు, బీడు భూములు కూడా మరోసారి ఈ–క్రాప్‌లోకి ఎక్కించాలని ఆదేశాలు ఇవ్వడం సమస్యగా మారింది. దీంతో మరోసారి జిల్లా వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలను ఈ–క్రాప్‌ (డిజిటల్‌ క్రాప్‌ సర్వే)లో నమోదు చేయాల్సి వచ్చిందని ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు వాపోతున్నారు. ఇదొక్కటే అయితే సమస్య ఉండేది కాదని.. ఇప్పుడు ఆధార్‌ తరహాలో రైతులకు 11 అంకెల విశిష్ట సంఖ్య (యూనిక్‌ నంబరు) కేటాయించే ఏపీ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ (ఏపీఎఫ్‌ఆర్‌) కూడా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

● మరోపక్క న్యాచురల్‌ ఫార్మింగ్‌ కింద ఈ నెల 20 లోపు 23,711 మట్టి నమూనాలు (సాయిల్‌ శాంపిల్స్‌) సేకరించి ప్రయోగశాలలకు పంపాలని ఉత్తర్వులు జారీ చేశారు. తక్కువ సమయంలో ఇది కూడా పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు.

● కొత్తగా ఫార్మర్‌ యాప్‌ (ఏపీఎఐఎంఎస్‌–2) ప్రతి రైతు మొబైల్‌లోనూ డౌన్‌లోడ్‌ చేయించాలని ఆదేశించారు. ఇంకో పక్క రోజుకు కనీసం 20 శాంపిల్స్‌ యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో ఫ్యామిలీ సర్వేకు ఎంతలేదన్నా అరగంట సమయం పడుతుందని చెబుతున్నారు. ఇవన్నీ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లపై భారం మోపడంపై మానసికంగా, శారీరకంగానూ ఆందోళన చెందుతున్నారు.

● ప్రతి మంగళ, బుధవారం ‘పొలం పిలుస్తోంది’, యూరియా సమస్య లేకుండా పర్యవేక్షణ, ఇతరత్రా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుందని ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు చెబుతున్నారు. ఉదయం ఏడుకే ఫీల్డ్‌కు వెళుతున్నా టార్గెట్లు రీచ్‌ కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. దానికి తోడు సాంకేతిక సమస్యల కారణంగా కొన్నిసార్లు యాప్‌లు సక్రమంగా పనిచేయడం లేదని చెబుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 326 ఆర్‌ఎస్‌కేల పరిధిలో అసిస్టెంట్లు పనిభారంతో అల్లాడిపోతున్నారు.

చంద్రబాబు సర్కార్‌ మల్టీ టాస్క్‌లు

ఉదయం ఏడింటికే క్షేత్రస్థాయికి వెళ్లినా టార్గెట్‌ పూర్తికాని దుస్థితి

ఈ–క్రాప్‌, శాంపిల్స్‌, ఏపీఎఫ్‌ఆర్‌, యూనిఫైడ్‌ సర్వేతో ఒత్తిళ్లు

‘పొలం పిలుస్తోంది’, కార్యక్రమాలతో ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు సతమతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement