పారదర్శకంగా దరఖాస్తుల పరిష్కారం

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి  - Sakshi

అనంతపురం అర్బన్‌: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2024లో భాగంగా అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారంలో పారదర్శకత పాటిస్తున్నామని కలెక్టర్‌ గౌతమి రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. ప్రధానంగా ఓట్ల తొలగింపు దరఖాస్తులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి సూక్ష్మపరిశీలన చేస్తున్నామన్నారు. ఓటరు జాబితా సవరణ, క్లెయిమ్‌ల పరిష్కారంపై కలెక్టర్‌ బుధవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కొత్తగా ఓటరు నమోదుకు (ఫారం–6) 1,33,696 దరఖాస్తులు రాగా 92,788 పరిష్కరించామని, 11,512 దరఖాస్తులు తిరస్కరించామని వెల్లడించారు. 29,396 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఓట్ల తొలగింపునకు (ఫారం–7) 1,16,004 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 64,393 పరిష్కరించామని, 17,189 తిరస్కరించామని పేర్కొన్నారు. 34,422 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. ఓటరు వివరాల్లో చేర్పులు, మార్పులకు (ఫారం–8) 1,27,798 దరఖాస్తులు రాగా అందులో 1,07,570 పరిష్కరించామని, 5,264 తిరస్కరణకు గురయ్యాయన్నారు. 14,964 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటన్నింటినీ ఈ నెల 26లోగా పరిష్కరిస్తామన్నారు.

పారదర్శకంగా విచారణ

ప్రధానంగా ఓట్ల తొలగింపు క్లెయిమ్‌లను అత్యంత పారదర్శకంగా విచారణ చేస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. మృతి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు బీఎల్‌ఓలో క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారన్నారు. మరణ ధ్రువీకరణ పత్రం లేదా పంచనామా, వారి కుటుంబ సభ్యుల నుంచి రాతపూర్వక వాంగ్మూలం తీసుకున్న తరువాత తొలగించేందుకు ఏఈఆర్‌ఓకు సమరిస్తారన్నారు. ధ్రువీకరణ పత్రాలను ఏఈఆర్‌ఓ పరిశీలన చేసిన తరువాత తదుపరి చర్యలకు ఈఆర్‌ఓకు సమర్పిస్తారన్నారు. దరఖాస్తును ఈఆర్‌ఓ పరిశీలించిన అంగీకరించిన తరువాత జాబితా నుంచి ఓటు తొలగిస్తున్నారన్నారు.

నిబంధనల ప్రకారంమే తొలగింపు

డూప్లికేట్‌ ఓట్ల విషయంలో నిబంధనలు పాటిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. ఇలాంటి దరఖాస్తులను ఈఆర్‌ఓ తన లాగిన్‌ ద్వారా ఫార్మెట్‌–ఏ, ధ్రువీకరణ లేఖను సంబంధిత ఓటరుకు స్పీడ్‌ పోస్టు ద్వారా పంపిస్తారన్నారు. ఓటరు ఏ ఓటును జాబితా నుంచి తొలగించాలని ధ్రువీకరణ లేఖ ఇస్తారో దానిని తొలగిస్తారన్నారు. వీటికి 15 రోజుల గడువు ఉంటుందన్నారు. ఆ తరువా కూడా ఓటరు సమాధానం ఇవ్వకపోతే బీఎల్‌ఓ నేరుగా ఓటరు ఇంటికెళ్లి విచారణ చేసి డూప్లికేట్‌ ఓటు తొలగించేందుకు ధ్రువీకరణ లేఖను తీసుకుని ఏఈఆర్‌ఓకు సమర్పిస్తారన్నారు. ఏఈఆర్‌ఓ పరిశీలనంచి ఈఆర్‌ఓకు పంపుతారన్నారు. వాటిని ఈఆర్‌ఓ పరిశీలించి డూప్లికేట్‌ ఓటును తొలగిస్తారన్నారు.

ఈవీఎంలపై అవగాహన

ఈవీఎం ద్వారా ఓటు ఎలా వేయాలనేదానిపై స్వీప్‌ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టామని కలెక్టర్‌ గౌతమి పేర్కొన్నారు. కలెక్టరేట్‌, మూడు ఆర్డీఓ కార్యాలయాలు, నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా ఐదు వాహనాలు గ్రామాల్లో పర్యటిస్తూ ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధిలు కేవీ రమణ, సోమశేఖర్‌రెడ్డి, టీడీపీ ప్రతినిధి పవన్‌కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి ఇమామ్‌, బీజేపీ ప్రతినిధి శ్యాంసుందర్‌, సీపీఎం ప్రతినిధి బాలరంగయ్య, సీపీఐ ప్రతినిధి రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ఓట్ల తొలగింపు క్లెయిమ్‌లపై సూక్ష్మ పరిశీలన

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top