
పోలీసులు అదుపులో ఉన్న నిందితుడు రవి
గుత్తి: అనుమానం పెనుభూతమైంది. తాగుడుకు బానిసైన వ్యక్తి చివరకు నిద్రిస్తున్న తన భార్యపై గొడ్డలితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్‌ఎస్‌లోని ఎస్సీ కాలనీకి చెందిన రవి, దేవి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. మద్యానికి బానిసైన రవి జులాయిగా మారాడు. ఈ క్రమంలోనే మద్యం కొనుగోలుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ భార్యను వేధించేవాడు. దీనికి తోడు కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వేకువజామున నిద్రలో ఉన్న భార్యపై గొడలితో దాడి చేశాడు. తలపై మూడు సార్లు నరికాడు. రక్తపు మడుగులో పడి ఉన్న దేవిని చూసి చనిపోయిందని భావించి పరారయ్యాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే దేవిని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలు సుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రవిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి వినియోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై సీఐ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

చికిత్స పొందుతున్న దేవి