
రాయదుర్గం: ప్రతి ఇంటా ఘన స్వాగతం.. ఆత్మీయ ఆదరణ, ఆప్యాయతతో కూడిన పలకరింపుల నడుమ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం నియోజకవర్గంలో 540 రోజులపాటు సాగించిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రజాదీవెనలతో మంగళవారం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు 96 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోని 265 గ్రామాల్లో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు విప్ కాపు కృతజ్ఞతలు తెలిపారు. డి.హీరేహాళ్ మండలం మురడిలో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య హాజరయ్యారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులంతా తరలివచ్చారు. బాణా సంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 18 నెలలపాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. రాయదుర్గం చరిత్రలోనే 1,02,569 గడపలు తొక్కిన ఏకై క ఎమ్మెల్యే తానే కావడం గర్వంగా ఉందని చెప్పారు. సంక్షేమంలో సరికొత్త విప్లవానికి సీఎం జగన్ నాంది పలికారని పేర్కొన్నారు. నవరత్నాల పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా కృషి చేశారని కొనియాడారు. ప్రతి కుటుంబానికీ రూ.2లక్షల నుంచి రూ.10 లక్షలకు పైగా పథకాల ద్వారా లబ్ధి కలిగిందన్నారు.
పాలనలో తేడా గమనించండి
టీడీపీ – వైఎస్సార్‌సీపీ పాలనలో తేడాలను ప్రజలు గమనించాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సూచించారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు, కాలవ శ్రీనివాసులు ప్రజాధనాన్ని భారీ స్థాయిలో దోపిడీ చేశారని విమర్శించారు. 2014 ఎన్నికల్లో 650 హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు. మరోసారి ఉత్తుత్తి హామీలతో మీ ముందుకు వచ్చే టీడీపీ దొంగలను ఎక్కడికక్కడ అడ్డుకుని, గత ఎన్నికల హామీలు ఏమయ్యాయో నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం పైలా నరసింహయ్య మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడటంతో ‘పచ్చ’ దొంగల హడావుడి పెరిగిందని, వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ చైర్మన్ భోజరాజ్‌నాయక్, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఎం.వన్నూర్‌స్వామి, మురడి సర్పంచ్ గంగప్ప, మాజీ సర్పంచ్ పద్మనాభరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు పాల్గొన్నారు.
మురడిలో టీడీపీకి బిగ్ షాక్
మురడి గ్రామంలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వ్యవహారశైలి నచ్చక పలువురు టీడీపీకి రాజీనామా చేసి విప్ కాపు రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ నాయకులు టి.ధనుంజయ్య, టి.తిప్పేస్వామి, మార్తల్ వెంకటేశులు, ఆర్‌బీ వంక తిప్పేస్వామి, తమ్మేపల్లి చంద్ర, సత్తి, చాకలి పరమేష్, వారి అనుచరులకు కాపు, పైలా నరసింహయ్యలు కండువాలు వేసి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ప్రజా దీవెనలతో ‘గడప గడప’ పూర్తి
మురడిలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల సంబరాలు