గైనిక్ సేవలపై ఎన్‌ఎంసీ సంతృప్తి

అనంతపురం క్రైం: బోధనాస్పత్రి (అనంతపురం సర్వజనాస్పత్రి)లోని గైనిక్ సేవలపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) సంతృప్తి వ్యక్తం చేసింది. శుక్రవారం గైనిక్ విభాగంలో 12 పీజీ సీట్ల గుర్తింపునకు సంబంధించి ఎన్‌ఎంసీ సభ్యురాలు గుజరాత్ జామ్‌నగర్‌లోని షా వైద్య కళాశాల గైనిక్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రీతి శుక్రవారం బోధనాస్పత్రిలో పర్యటించారు. లేబర్, ఆంటినేటల్, గైనిక్ యూనిట్లను పరిశీలించారు. రోజూ ఓపీ 150కుపైగా ఉంటుందని, సగటున 28 ప్రసవాలు జరుగుతున్నాయని గైనిక్ హెచ్‌ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం ఎన్‌ఎంసీ సభ్యురాలికి వివరించారు. యూనిట్లలో 115 శాతం గర్భిణి, బాలింతలు ఉన్నట్లు ఆమె నమోదు చేశారు. అనంతరం ఓపీ, ఐపీ, తదితర సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు సకాలంలో రక్తం అందుతోందా? రక్త నిధి సామర్థ్యం తదితర వివరాలను బ్లడ్ బ్యాంకు వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. గైనిక్ ఓపీలు, మెయిన్ ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీ ఓటీ, సెంట్రల్ ల్యాబ్, ఎమర్జెన్సీ, ఏఎంసీ, తదితర విభాగాలను పరిశీలించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవితో సమావేశమయ్యారు. వైద్య కళాశాలలో వివిధ ల్యాబ్‌లను ఆమె పరిశీలించారు. అనంతరం గైనిక్ విభాగం వైద్యుల హెడ్ కౌంట్ చేశారు. ఎన్‌ఎంసీ సభ్యురాలు ప్రొఫెసర్లు డాక్టర్ సంధ్య, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.
02ఏఎన్‌జీ 17 ఏ, బీ