రాయదుర్గం టౌన్: మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు ఆశించిన మేర ఫలితాలను రాబట్టింది. ఆసలు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు జగన్‌సర్కార్ ప్రకటించడం తెలిసిందే. వడ్డీ రాయితీ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ క్రమంలో పన్ను అసలు మొత్తాన్ని చెల్లించేందుకు యజమానులు మున్సిపాలిటీలకు బారులు తీరారు. శుక్రవారం అర్ధరాత్రిలోపు పాత, కొత్త బకాయిలు కలిపి చెల్లిస్తే వడ్డీ పూర్తిగా మాఫీ అవుతుంది. ఈ విధానంతో మున్సిపాలిటీలకు కొంత మేర నష్టం చేకూరుతున్నప్పటికీ.. చెల్లింపుదారులపై పెద్ద మొత్తంలోనే ఆర్థిక భారం తగ్గనుంది. గురువారం సాయంత్రం నాటికి 92 శాతం వసూళ్లతో తాడిపత్రి మున్సిపాలిటీ మొదటిస్థానంలో ఉండగా 83 శాతం వసూళ్లతో రాయదుర్గం రెండోస్థానంలో నిలిచింది.
పెళ్లి సంబంధాలు కుదరక యువకుడి బలవన్మరణం
కుందుర్పి: పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన గొల్ల నటరాజ్ (22)కు పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేపట్టారు. ఈ క్రమంలో పలు సంబంధాలు చూశారు. ఏ సంబంధమూ కుదరలేదు. దీంతో వయసు మీరిపోతే తనకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకురారంటూ జీవితంపై విరక్తి పెంచుకున్న నటరాజ్... గురువారం తెల్లవారుజామున ఇంటి పక్కనే ఉన్న మరో గదిలోకి వెళ్లి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కృష్ణమూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
వివాహిత ఆత్మహత్య
● మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం
శెట్టూరు: జీవితంపై విరక్తితో ఓ వివాహిత ఆత్మ హత్య చేసుకుంది. ఘటనతో తీవ్ర మనోవేదనకు లోనైన భర్త గంటల వ్యవధిలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు... శెట్టూరు మండలం కై రేవు గ్రామానికి చెందిన కురుబ ఓంకారమ్మ (40), మల్లికార్జున దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓంకారమ్మకు పలు ఆస్పత్రుల్లో కుటుంబసభ్యులు చికిత్స చేయించారు. జబ్బు నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆమె గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు తిరిగి వచ్చి చూసేసరికి ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ యువరాజ్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, భార్య మృతిని జీర్ణించుకోలేక గురువారం సాయంత్రం భర్త మల్లికార్జున క్రిమి సంహారక మందు తాగాడు. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెనువెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నీటితొట్టెలో పడి బాలుడి మృతి
వజ్రకరూరు: నీటితొట్టెలో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని వెంకటాంపల్లి చిన్నతండాలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుమార్‌నాయక్, లక్ష్మిదేవి దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు అకిరా నందన్‌నాయక్ (18 నెలలు) గురువారం ఆడుకుంటూ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలో పడిపోయాడు. చుట్టుపక్కలంతా వెతికిన తల్లిదండ్రులు చివరకు నీటి తొట్టెలో పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే బయటకు తీసి ఉరవకొండ ప్రభుత్సాపత్రికి తీసుకురాగా.. పరిశీలించిన వైద్యులు అకిరా నందన్‌నాయక్ మరణించినట్లు నిర్ధారించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బాలుడి మృతదేహం
ఓంకారమ్మ (ఫైల్)


