ప్రశాంత గ్రామాల్లో చిచ్చు రేపొద్దు లోకేష్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత గ్రామాల్లో చిచ్చు రేపొద్దు లోకేష్‌

Mar 31 2023 12:58 AM | Updated on Mar 31 2023 12:58 AM

మాట్లాడుతున్న పైలా నరసింహయ్య   - Sakshi

మాట్లాడుతున్న పైలా నరసింహయ్య

అనంతపురం క్రైం: ప్రశాంత గ్రామాల్లో చిచ్చు రేపి అధికారంలోకి రావాలనే ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య హెచ్చరించారు. తన పాదయాత్రలో ఫ్యాక్షన్‌ వైపు యువత ప్రభావితమయ్యేలా ప్రసంగాలు సాగిస్తున్న లోకేష్‌ తీరును ఆయన ఖండించారు. మరోసారి ఈ తరహా ప్రసంగాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అజెండా లేకుండా చేపట్టిన పాదయాత్రలో యువతను ఆకట్టుకునేందుకు విద్వేషాలు చెలరేగేలా ప్రసంగాలు చేయడం అమానవీయ చర్య అని అన్నారు. తన తండ్రిలా రాముడిని కాదని, రాక్షసున్ని, మూర్ఖున్ని, ఫ్యాక్షనిస్టుని అంటూ లోకేష్‌ ప్రగల్బాలు పలుకుతూ టీడీపీ అధికారంలోకి వస్తే వైఎస్సార్‌ సీపీ నాయకులను చెడ్డీలతో ఊరేగిస్తామంటూ యువతను రెచ్చగొట్టి ప్రశాంత గ్రామాల్లో చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు జనం నుంచి స్పందన లేకపోవడంతో మీడియాను ఆకర్షించేందుకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు నిండాయని, తద్వారా పాడి పంటలతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఇలాంటి తరుణంలో విద్వేషాలకు తెరలేపి రాజకీయ లబ్ధి పొందాలనుకోడం దుర్మార్గమన్నారు. హైదరాబాద్‌ను కేరాఫ్‌ అడ్రస్‌గా చేసుకుని ఇక్కడ రాజకీయాలు చేయడం కాదని, అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం ప్రాంతాలను ఆవాసంగా మార్చుకుని చూస్తే వాస్తవమేమిటో అర్థమవుతుందన్నారు. టీడీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందన్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నలుగురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని గుర్తు చేశారు. అవినీతి అనేది చంద్రబాబు నరనరాల్లో ప్రవహిస్తోందన్నారు. చేతనైతే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ప్రజాక్షేత్రంలో మరోసారి పోటీకి సిద్ధమవ్వాలని సవాల్‌ విసిరారు. ఇప్పటికై నా జో(లో)కేష్‌ మాట తీరు మార్చుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ నాలుగేళ్లలో పార్టీ గుర్తుతో టీడీపీ గెలిచిన దాఖలాలు ఒక్కటి కూడా లేవన్నారు. రాబోవు ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీకే ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు.

బిల్లె శ్రీనివాస్‌ మృతికి సంతాపం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ కార్యకర్త బిల్లె శ్రీనివాస్‌ మృతిపై పైలా నరసింహయ్య సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమావేశంలో కక్కలపల్లి సర్పంచ్‌ గాండ్ల కృష్ణయ్య, ఉప సర్పంచ్‌ బండి రమేష్‌, నాయకులు బయప్ప, శంకర్‌ రెడ్డి, యల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య

పబ్లిసిటీ పిచ్చితో యువతను ఫ్యాక్షన్‌ వైపు ఉసిగొల్పితే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement