అనంతపురం అర్బన్‌:..... | - | Sakshi
Sakshi News home page

అనంతపురం అర్బన్‌:.....

Mar 28 2023 12:42 AM | Updated on Mar 28 2023 12:42 AM

- - Sakshi

అనంతపురం అర్బన్‌: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) పేదలకు ఆహార భద్రత కల్పించే విషయంలో జగన్‌ సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఇదివరకటిలా ముక్కిపోయిన బియ్యం కాకుండా తినడానికి ఆమోదయోగ్యమైన బియ్యం సరఫరా చేస్తోంది. ఖర్చుకు వెనకాడకుండా నాణ్యమైన బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ చౌకధాన్యపు దుకాణాల ద్వారా కార్డుదారులకు అందిస్తోంది. ఇంతటి నాణ్యమైన బియ్యంపై మాఫియా కన్ను పడింది. పేదల ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకుని.. వారి నుంచి బియ్యం కారుచౌకగా కొనుక్కుని.. పొరుగు రాష్ట్రంలో మూడు రెట్లకు అదనంగా అమ్మి సొమ్ము చేసుకుంటోంది. మాఫియాగా ఏర్పడిన వారు బియ్యం దందాను వృత్తిగా ఎంచుకున్నారు. కర్ణాటక సరిహద్దుకు ఆనుకుని ఉన్న జిల్లాలోని పలు ప్రాంతాల మీదుగా బియ్యం తరలించేస్తున్నారు. అధికారులు దాడులు చేసి.. కేసులు నమోదు చేస్తున్నా నామమాత్రపు జరిమానాలు చెల్లించి మళ్లీ దందా కొనసాగిస్తున్నారు.

కిలో రూ.10తో చౌకబియ్యం కొనుగోలు

ప్రభుత్వం పేదలకు అందిస్తున్న బియ్యంపై కిలోకు రూ.38.50 ఖర్చు చేస్తోంది. అయితే బియ్యం మాఫియాదారులు కిలో రూ.10కే ఈ బియ్యం కొంటున్నారు. ఇంటింటికీ తిరిగి బియ్యం సేకరించి 50 కిలోల సంచుల్లో ప్యాకింగ్‌ చేస్తున్నారు. అనంతరం బళ్లారి, బెంగళూరు, బంగారుపేట, పావగడ, చిక్‌బళ్లాపూర్‌ తదితర ప్రాంతాలకు గుట్టుచప్పుడుగా తరలిస్తున్నారు. ఈ బియ్యాన్ని కిలో రూ.40 దాకా విక్రయించి జేబులు నింపుకుంటున్నారు.

మూడు నెలల్లో 41 కేసులు

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పౌర సరఫరాల అధికారులు తరచూ దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 41 కేసులు నమోదు చేశారు. 255.579 టన్నుల (2,255.79 క్వింటాళ్ల) బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.38.50 పైసలు వెచ్చిస్తోంది. ఆ లెక్కన అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ బియ్యం విలువ రూ.98.40 లక్షలు అన్నమాట.

కఠిన శిక్షలు లేకనే...

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులపై కఠిన శిక్షలు లేకపోవడం వల్లే దందా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమంగా తరలుతున్న బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేస్తారు. ఈ కేసులను జాయింట్‌ కలెక్టర్‌ విచారణ చేసి జరిమానా విధిస్తారు. అలా కాకుండా స్టోర్‌ బియ్యం అక్రమంగా రవాణా చేసే వ్యక్తులకు కఠిన శిక్షలు అమలు చేస్తే కొంత వరకు కట్టడి చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ నెల 14న గుంతకల్లు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఇంటి నంబరు 158, 159 ఆవరణలో 249.50 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనాన్ని విజిలెన్స్‌, పౌర సరఫరాల అధికారులు పట్టుకున్నారు. బియ్యం తరలిస్తున్న ఐదుగురిపై 6ఏ కింద కేసు నమోదు చేశారు.

బియ్యం.. రయ్‌రయ్‌

కార్డుదారుల నుంచి చౌకగా కొనుగోలు

జిల్లా సరిహద్దు నుంచి జోరుగా దందా

కర్ణాటకలో మూడు రెట్లు అదనంగా విక్రయాలు

అధికారులు దాడులు చేస్తున్నా ఆగని బియ్యం దందా

రాప్తాడు మండలం హంపాపురం క్రాస్‌ జాతీయ రహదారి 44 వద్ద ఈ నెల 11న విజిలెన్స్‌, పౌర సరఫరాల అధికారులు దాడులు నిర్వహించి.. 34 క్వింటాళ్లు రేషన్‌ బియ్యంతో ఉన్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వ్యక్తులపై 6ఏ కింద కేసు నమోదు చేశారు.

యాడికిలోని రైస్‌మిల్‌లో విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్న రేషన్‌ బియ్యం (ఫైల్‌)1
1/4

యాడికిలోని రైస్‌మిల్‌లో విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్న రేషన్‌ బియ్యం (ఫైల్‌)

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement