నిస్తేజం | - | Sakshi
Sakshi News home page

నిస్తేజం

Nov 17 2026 1:14 AM | Updated on Nov 17 2026 1:14 AM

బెల్లం మార్కెట్‌..

● లక్ష ఎకరాల నుంచి రెండు వేల హెక్టార్లకు పడిపోయిన విస్తీర్ణం

● నాలుగు చక్కెర కర్మాగారాలు మూసివేత

● అనకాపల్లి బెల్లం..కీర్తి గత వైభవమే..

● చిత్తశుద్ధి లేని పాలకుల వైఖరి వల్లే ఈ పరిణామం

సాక్షి, అనకాపల్లి: ఉమ్మడి జిల్లాలో ఏడాదికి సరాసరిన లక్ష ఎకరాల్లో సాగు చేసే చెరకు విస్తీర్ణం ఈ సీజన్‌లో రెండు వేల హెక్టార్లకే పడిపోయిది. సాలీనా రూ.200 కోట్ల బెల్లం వ్యాపార టర్నోవర్‌ ఉండే అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో లావాదేవీలు ఈ యేడాది నిరాశాజనకంగా మొదలయ్యాయి. ఏప్రిల్‌ నుంచి మొదలయ్యే సీజన్‌ పరంగా అర్థ సంవత్సరంలో కేవలం 3.6 కోట్ల వ్యాపారం జరిగిందంటే ఎంత మేరకు బెల్లం వ్యాపారం పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా పరిధిలోని ఉండే నాలుగు చక్కెర కర్మాగారాల్లో క్రషింగ్‌ నిలిచిపోయింది. జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్‌ గుర్తింపు ఇక చరిత్ర కానుంది. తీపిని పంచే బెల్లం మరికొన్ని సంవత్సరాల్లో చేదు జ్ఞాపకాలనే మిగల్చనుంది. దీనికి గల కారణాలపై సాక్షి కథనం...

ఏదీ నాటి తోటల కళ..

వ్యవసాయం శుద్ధ దండగని గతంలోనే వ్యాఖ్యానించిన పాలకుల చేతుల్లోనే ఇప్పటి ప్రభుత్వం ఉంది. ఓటు బ్యాంక్‌ పరంగా వ్యవసాయ అనుబంధంగా ఉండే వారిని మోసం చేసేందుకే రైతన్నల ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. సుమారు రెండు లక్షల హెక్టార్లలో పంటలను సాగు చేసే రైతులు ఇప్పుడు బేలముఖం వేసుకొని చూస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు ఛాయల్లోకి వెళ్లినప్పటికీ రెండు తుఫాన్‌లతో తాత్కాలికంగా సాగు, తాగు నీటి ఎద్దడి నుంచి బయటపడే అవకాశం వచ్చింది. అనకాపల్లి జిల్లాలో కళకళలాడే చెరకు తోటలు జీవం కోల్పోయాయి. చెరకు పరిశోధనలపై నిత్యం పరిశోధనలు గావించే అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రైతులకు అందాల్సిన పరిశోధనా ఫలాలు ఇప్పుడు కానరావడం లేదు. కాలం చెల్లిన వంగడాలు..వ్యవసాయ రంగానికి శాపంగా మారిందని చెప్పుచ్చు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో పరిశోధనలకు, జీత భత్యాలకు కనీసం సాలీనా రూ.20 కోట్ల పైబడి నిధులు అవసరం అవుతున్నాయి. లాబీయింగ్‌ చేసే కొద్దిపాటి రైతులతో మాత్రమే అనుబంధం ఉండే పరిశోధకులు నేరుగా రైతులతో ఉండే బంధాన్ని మరిచిపోయారు. అనకాపల్లి నుంచి విడుదల చేసిన 21 వంగడాల్లో ఇప్పటి పరిస్థితులను తట్టుకునే వంగడాల ఛాయలే కనిపించడం లేదు. వైరస్‌ తెగుళ్లతో చెరకు పంట నాశనం అవుతుందని మొత్తుకున్నా పరిశోధకులు రైతుల వైపు చూడడమే మానేశారు. ఈ ప్రభావం జిల్లాలోని చక్కెర కర్మాగారాలపైనా, అనకాపల్లి బెల్లం మార్కెట్‌పైనా పడింది.

దీపావళికి టపాసులా వెలిగి...

పడిపోయిన దిగుబడులు..కానరాని గిట్టుబాటు

11 నెలల పాటు చెరకు సాగులో ఉండే రైతు పెట్టుబడికి తగ్గ ఆదాయం లేక ఆ పంట వైపు చూడటం మానేశారు. దీంతో సంప్రదాయ వాణిజ్య పంటకు జిల్లాలో ఆనవాళ్లు కనిపించడం లేదు. పట్టణీకరణ, పరిశ్రమల ఏర్పాటు, ఇబ్బడిముబ్బడిగా రియల్‌ వెంచర్లు కూడా వ్యవసాయ సాగుని ప్రభావితం చేస్తుందనేది వాస్తవమే. కానీ అనకాపల్లికి గుర్తింపునిచ్చిన బెల్లం మార్కెట్‌ కీర్తి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 2010లో 5 లక్షల క్వింటాళ్ల బెల్లం లావాదేవీలు జరిగిన అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో గత ఏడాది లక్షా 10 వేల కింటాళ్లకు పడిపోయిందంటే పరిస్థితి ఎంతటి దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చెరకు సాగు..దయనీయం

అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో ఈ యేడాది దీపావళి సయయంలో క్వింటాల్‌ బెల్లం 9 వేల రూపాయలు దాటింది. దీపావళికి తయారు చేసే మిఠాయిలు,నాగుల చవితికి ఉపయోగించే సిమ్మిడి తయారీలోనూ బెల్లాన్ని వాడతారు. అందుకే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న తక్కువ బెల్లానికి గిరాకీ పెరిగింది. ప్రస్తుతం బెల్లం కోసం పొరుగు జిల్లాల వైపు వర్తకులు చూడాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అందించిన కానుకలో పంపిణీ చేసే బెల్లం కాంట్రాక్ట్‌ ఏపీ వర్తకులకు కాకుండా గుజరాత్‌కు చెందిన సంస్థకు కేటాయించిన సంగతి తెలిసిందే. పోషక విలువలుండే బెల్లం వాడకానికి తగ్గట్టుగా బెల్లం తయారీ లేకపోవడంతో వేలాది మంది రైతులు, కూలీలు, చక్కెర కర్మాగారాల కార్మికులు, బెల్లం మార్కె ట్‌లోని కొలగార్లపై పడుతోంది. వారి జీవనోపాధికి దెబ్బ కలిగినట్టయింది. చెరకు సాగు తిరోగమనానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ చిత్తశుద్ధి లేని పాలకుల తీరు ప్రధాన కారణమయ్యింది. ఈ కారణంగా జిల్లాలోని నాలుగు చక్కెర కర్మాగారాల్లో నిశ్శబ్ధం ఆవరించగా,అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో నిస్తేజం అలుముకుంది. 2 వేల హెక్టార్లకు పడిపోయిన చెరకు విస్తీర్ణం మరికొన్ని సంవత్సరాల్లో అసలే కానరాని పరిస్థితికి వస్తుందని బెల్లం రైతులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement