రాయితీ పేరుతో కుళ్లిన ఉల్లిపాయల విక్రయాలు
బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.60–70
ధరల నియంత్రణలో మార్కెటింగ్ శాఖ వైఫల్యం
మహారాణిపేట: ఉల్లి ధరలు కొండెక్కుతున్నాయి. రైతుబజార్లలో రాయితీ ఉల్లిపాయల పేరుతో నాసిరకం సరుకు దర్శనమిస్తోంది. ఓవైపు బహిరంగ మార్కెట్‌లో ధరల భారం.. మరోవైపు రైతుబజార్లలో కుళ్లిన ఉల్లిపాయలు. వెరసి సామాన్య వినియోగదారులకు ఉల్లి కష్టాలు తప్పడం లేదు. రాయితీపై ఉల్లిపాయలు అందిస్తున్నామంటున్న ప్రభుత్వం.. వాటి నాణ్యతను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు గిట్టుబాటు ధర లేక రైతులను కన్నీరు పెట్టించిన ఉల్లి.. ఇప్పుడు ధరల పెరుగుదలతో వినియోగదారులకు కంటతడి పెట్టిస్తోంది. విశాఖలోని 15 రైతుబజార్లలో మార్కెటింగ్ శాఖ కిలో రూ.35 చొప్పున రాయితీ ఉల్లిపాయలను విక్రయిస్తోంది. కర్నూలు నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఉల్లిపాయల్లో నాణ్యత లోపించడంతోపాటు కొన్ని కుళ్లిపోయినవి ఉంటున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు రకాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ ఏదీ?
ధరల పెరుగుదలకు పలు కారణాలు చెబుతున్న వ్యాపారులు, అధికారులు.. వినియోగదారులకు మాత్రం ఊరట కల్పించలేకపోతున్నారు. రైతుబజార్లకు సరఫరా చేస్తున్న ఉల్లిపాయల నాణ్యతను పరిశీలించాల్సిన మార్కెటింగ్ శాఖ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ధరలను నియంత్రించడంతోపాటు రైతుబజార్లలో నాణ్యమైన ఉల్లిపాయలు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రాయితీ పేరుతో నాసిరకం సరుకు అంటగడితే సామాన్యులకు ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


