నక్కపల్లి: కోర్టు తీర్పువచ్చే వరకు చీడిక, దోసలపాడు పంచాయతీలకు ఎన్నికలు నిలిపివేయాలంటూ గ్రామస్తులు సోమవారం అధికారులకు వినతి పత్రం అందజేసారు. ఇప్పటి వరకు చీడిక, చీడిక కొత్తూరు, దోసలపాడు కలిపి పంచాయతీగా ఉండేవి. గత పర్యాయం ఎన్నికల ముందు చీడికలో నివసించే గిరిజనులతోపాటు, కొత్తూరులో నివసించేవారంతా కలిసి తమ పంచాయతీని దోసలపాడునుంచి వేరు చేసి కొత్తపంచాయతీ ఏర్పాటు చేయాలని కోరడంతో అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలు పంపించారు. చీడికను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేస్తూ చీడిక కొత్తూరును దోసలపాడు పంచాయతీలో ఉంచేసారు. అయితే దీనిపైచీడిక కొత్తూరుకు చెందిన కొంతమంది చీడిక కొత్తూరును దోసలపాడులో కాకుండా చీడిక పంచాయతీలో కొనసాగించాలని కోర్టును ఆశ్రయించడంతో కొత్తపంచాయతీ ఏర్పాటు పెండింగ్‌లో పడింది. దీంతో 2021లో దోసలపాడు పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. అయితే ఇటీవల అధికారులు చీడికను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేసి చీడిక కొత్తూరును దోసలపాడులో ఉంచి రెండు పంచాయతీలకు ఎన్నికలునిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై చీడిక కొత్తూరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేనెలలో కోర్టు వాయిదా ఉందని, తుది తీర్పు వెలువడే వరకు ఈ రెండు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించరాదని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిరాహారదీక్ష చేపడతామని, అనుమతి ఇవ్వాలని పోలీసు వారిని కోరుతున్నారు. సోమవారం ఆళధికారులను కలిసిన వారిలో కర్రి చినఅబ్బాయి, వీసం శ్రీను,వీసం నర్సింగరావు, పప్పుశ్రీను,వెదుళ్ల నాగేశ్వరరావు, వెదుళ్లరాజు,పప్పు బాబ్జి ఉన్నారు.
అధికారులకు చీడిక గ్రామస్తుల వినతి


