తుమ్మపాల: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా చేపడుతున్నామని, ఎన్నికల నిబంధనలు, పోలింగ్ సరళి, రిటర్నింగ్ అధికారుల విధులకు సంబంధించి ఈ శిక్షణలో సమగ్ర అవగాహన ఎంతో దోహదపడుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అఽధికారి విజయకృష్ణన్ అన్నారు. అనకాపల్లి మండలం శంకరంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సమావేశ మందిరంలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి, అధికారులకు రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరిగేలా అధికారులంతా పనిచేయాలన్నారు. అన్ని సేవలు సక్రమంగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో రాజ్‌కుమార్, డ్వామా పీడీ నిర్మలాదేవి, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ఏడీ సత్యనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో అనకాపల్లి మండలం రేబాక నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం పరిశీలించారు. కేంద్రాల వద్ద జనం గుమిగూడకుండా చూడాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యర్థి అభ్యర్థులు ఒకేచోట గుమిగూడకుండా పరిస్థితులను పర్యవేక్షించాలని తెలిపారు. టోకెన్ విధానం ప్రారంభించి క్రమపద్దతిలో దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ నరసింహారావు, సీఐ అశోక్ కుమార్, ఎస్‌ఐ రవికుమార్ ఉన్నారు.


