పెను విషాదం | - | Sakshi
Sakshi News home page

పెను విషాదం

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

● చెల్లి మృతి.. అక్కకు తీవ్ర గాయాలు

నాగులచవితి పండగ వేళ పెను విషాదం చోటుచేసుకుంది. పండగ సంబరాలతో కళకళలాడాల్సిన కుటుంబాల్లో తీరని శోకం నిండుకుంది. వేర్వేరు ప్రమాదాల్లో గోవాడకు చెందిన ముగ్గురు, ఎస్‌.రాయవరం మండలం గుర్రాజుపేటకు చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గోవాడలో శారదానదిలో మునిగి ఇద్దరు రైతులు, విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందగా.. గుర్రాజుపేటకు చెందిన ఇద్దరు కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయా గ్రామాల్లో ఎక్కడ చూసినా రోదనలు మిన్నంటాయి.
పండగ వేళ
సరదా ప్రయాణం.. తీరని శోకం

●వేర్వేరు ప్రమాదాల్లో గోవాడకు చెందిన ముగ్గురు మృతి

●శారదానదిలో మునిగి ఇద్దరు రైతులు.. విశాఖలో రోడ్డు ప్రమాదంలో మరో యువతి

●కారు ప్రమాదంలో గుర్రాజుపేటకు చెందిన ఇద్దరి దుర్మరణం

●శోకసంద్రంలో బాధిత కుటుంబాలు, గ్రామస్తులు

చోడవరం: నాగులచవితి పండగ అంటే గ్రామీణ రైతు కుటుంబాల్లో పెద్ద పండగే. అలాంటి పండగ పూట రెండు వేర్వేరు ప్రమాదాల్లో గోవాడ గ్రామానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో గ్రామంలో ఏ వీధిలో చూసినా విషాదమే అలముకుంది. గోవాడకు చెందిన శానాపతి అప్పారావు, ఏడువాక నూకరాజు శారదానదిలో మునిగిపోయి ఇసుక ఊబిలో చిక్కుకొని మృత్యువాత పడ్డారు. ఇదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కోరిమిల్లు వేణుగోపాలరావు(కిషోర్‌) కుమార్తెలిద్దరూ స్కూటీపై విశాఖపట్నం నుంచి గోవాడకు వస్తుండగా జరిగిన ప్రమాదంలో చిన్న కుమార్తె అమృతవర్షిణి(21)అక్కడికక్కడే మృతిచెందగా.. పెద్దకుమార్తె ఆదిత్యవర్షిణి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఊబిలో చిక్కుకొని.. ఊపిరొదిలి..

చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన శానాపతి అప్పారావు(53), ఏడువాక నూకరాజు(45) శానాపతి స్వామి, అట్టానాయుడు కలిసి శారదానది అవతల ఉన్న పొలాల్లోకి బయలు దేరారు. నది దాటుతున్న క్రమంలో నీటి గుంతలోకి దిగుతుండగా ఒక్కసారిగా ఇసుక ఊబి వారిని లోపలికి లాక్కుంది. ముందుగా అప్పారావు, నూకరాజు ఊబిలో చిక్కుకుపోయారు. స్వామి కూడా ఊబిలో చిక్కుకుంటున్న సమయంలో వెనుకనే ఉన్న నాయు డు వెంటనే ఆయన్ను వెనక్కిలాగి బయటకు తీశారు. దీంతో స్వామి, నాయుడు సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఊబిలో చిక్కుకుపోయిన అప్పారావు, నూకరాజు కోసం స్థానికులతో కలిసి వెతికారు. దొరకకపోవడంతో చోడవరం అగ్నిమాపక కేంద్రానికి, పోలీసు స్టేషన్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక, పోలీసు సిబ్బంది వచ్చి అప్పారావు, నూకరాజుల ఆచూకీ కోసం గాలించారు. మధ్యాహ్నానికి ఇద్దరి మృతదేహాలు నది గుంతలో ఉన్న ఇసుక ఊబిలో ఉన్నట్టు గుర్తించి బయటకు తీశారు. మృతుల్లో అప్పారావుకు భార్య లక్ష్మి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. నూకరాజుకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పొలంలోకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన ఇంటి యజమానులు నదిలో మునిగిపోయి మృతిచెందారని తెలియడంతో మృతుల కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగారు. ఇంటికి పెద్దదిక్కులు మృతిచెందడంతో ఆ కుటుంబాలు నిరాదరణగా మిగిలాయి. చోడవరం సీఐ అప్పలరాజు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసినట్టు సీఐ చెప్పారు. సంఘటనా స్థలాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఎస్‌.రాయవరం: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల్లో ఊహించని విషాదం అలముకుంది. రేవుపోలవరం బీచ్‌కు సరదాగా వెళ్లొచ్చిన ప్రయాణం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. గుర్రాజుపేటకు చెందిన 12 మంది యువకులు అద్దె కారులో బీచ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులంతా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నవారే కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో మృతిచెందిన కురందాసు శ్రీను(26), కొర్ని శ్రీను ఇద్దరూ తమ కుటుంబాలకు ఒక్కగానొక్క కుమారులు. కురందాసు శ్రీను అడ్డురోడ్డు వాటర్‌ ప్లాంట్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. మరో మృతుడు కొర్ని శ్రీను కొబ్బరికాయలు వలిచే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. చేతికందొచ్చిన కుమారులు స్నేహితులతో సరదాగా వెళ్లి విగతజీవులుగా తిరిగిరావడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది.

ఆస్పత్రుల చుట్టూ బంధువుల పరుగులు

మరోవైపు ప్రమాదంలో గాయపడిన నలుగురు యువకుల పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరిలోనూ పలువురు కుటుంబాలకు ఒక్కగానొక్క కుమారులే కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలకు అండగా ఉన్న యువకులు ప్రమాదానికి గురికావడంతో ఆయా కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు బంధువులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రమాదంలో మృతిచెందిన యువకుల మృతదేహాలను అధికారులు ఆస్పత్రిలోనే భద్రపరచడంతో వాటి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకేసారి ఆరు కుటుంబాల్లో విషాదం నెలకొనడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునే వారు లేకపోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

విశాఖపట్నం కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురందాసు దుర్గాప్రసాద్‌, అప్పలరాజు, అశోక్‌

పుట్ట పూజకు వెళ్తూ మృత్యు ఒడికి

పీఎం పాలెం: నాగులచవితి పండగను కుటుంబంతో కలిసి జరుపుకోవాలనుకున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. పుట్ట వద్ద పూజలు చేసేందుకు ఉదయాన్నే స్వగ్రామానికి బయలుదేరారు. కానీ ఆ ప్రయాణం మధ్యలోనే మృత్యువు కబళించింది. రోడ్డు ప్రమాదంలో చిన్న కుమార్తె ప్రాణాలు కోల్పోగా.. పెద్ద కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. పండగపూట ఇంటికి చేరాల్సిన బిడ్డ విగతజీవిగా తిరిగిరావడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. పీఎం పాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా చోడవరం సమీపంలోని గోవాడ గ్రామానికి చెందిన కోరిమిల్లి వేణుగోపాలరావు కుటుంబంతో కలిసి పీఎం పాలెం ఆఖరి బస్టాప్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. స్థానిక విద్యాసంస్థలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు ఎంబీఏ చదువుతున్న ఆదిత్యహర్షిణి(22), అమృతవర్షిణి(21) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగులచవితి సందర్భంగా శుక్రవారం ఉదయం 6 గంటలకు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ స్కూటీపై గోవాడకు బయలుదేరారు. తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆయన ఇంటివద్దే ఉండిపోయారు. జాతీయ రహదారిపై పీఎం పాలెం లా కాలేజీ జంక్షన్‌ సమీపానికి చేరుకోగానే స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న అమృతవర్షిణి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. వెనుక కూర్చున్న ఆదిత్యహర్షిణికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఆదిత్యహర్షిణిని ఆస్పత్రికి తరలించారు. అమృతవర్షిణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. పండగ పూట పుట్ట వద్ద పూజలు చేసి ఆనందంగా ఇంటికి తిరిగొస్తారనుకున్న కుమార్తెల్లో ఒకరు కానరాని లోకాలకు వెళ్లిపోవడం, మరొకరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుండటంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement