చోడవరం: మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన పశువుల కాపరి బండారు కృష్ణ (47) శుక్రవారం శారదానది వద్ద గల్లంతయ్యాడు. రోజూలాగే తన పశువులను మేపడానికి గ్రామ సమీపంలో ఉన్న శారదానది ఒడ్డుకు వెళ్లి తర్వాత నుంచి ఆయన కనిపించలేదు. శారదానదిలో కొద్దిమేర నీటి ప్రవాహం ఉంది. బహిర్భూమికి వెళ్లి నదిలో పడి గల్లంతై ఉండొచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. ఆయన కోసం గ్రామస్తులంతా కలిసి రాత్రి వరకూ వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చినట్టు గ్రామ మాజీ సర్పంచ్ శీరంరెడ్డి వెంకటరమణ తెలిపారు.


