కశింకోటలో కేంద్ర బృందం పర్యటన | - | Sakshi
Sakshi News home page

కశింకోటలో కేంద్ర బృందం పర్యటన

Nov 14 2026 12:59 AM | Updated on Nov 14 2026 12:59 AM

● జాతీయ పురస్కారానికి ప్రతిపాదించిన జి.భీమవరం గ్రామ సందర్శన ● పంచాయతీ రికార్డులు పరిశీలించి గ్రామసభ నిర్వహించిన అధికారులు

కశింకోట: జాతీయ స్థాయి పంచాయతీ పురస్కారానికి ప్రతిపాదించిన మండలంలోని జి.భీమవరం గ్రామ పంచాయతీని కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. గ్రామంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలనాపరమైన విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు గ్రామసభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఈ ఏడాది జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా వరుసగా రూ.కోటి, రూ.75 లక్షలు, రూ.50 లక్షలు అందించనున్నారు. ఇందుకోసం 2023–24 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఐదు అధికారుల బృందాలు జి.భీమవరం పంచాయతీని పరిశీలించాయి. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ సీనియర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌.కె.శర్మ, పంచాయతీరాజ్‌ శాఖ స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కన్సల్టెంట్‌ జి.వినోద్‌కుమార్‌లతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించింది. గ్రామసభలో ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అందుతున్నాయని ఆరా తీసింది. వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా అందుతున్న సేవలు, వాటి ఉపయోగాల గురించి అడిగి తెలుసుకుంది. 104 వాహన సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ ఉద్యోగుల విధుల వివరాలతో కూడిన జాబ్‌చార్ట్‌, గ్రామంలో అమలవుతున్న కార్యక్రమాల ఫొటో ప్రదర్శన, అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాళ్లను బృందం పరిశీలించింది. బృందం అందించే నివేదిక, సిఫార్సుల ఆధారంగా జాతీయ పురస్కారంపై నిర్ణయం వెలువడనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఓఎస్‌డీ డాక్టర్‌ ఎం.సత్యసాయి, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ సమన్వయకర్త వినోద్‌, జిల్లా సీఈవో సత్యనారాయణ, డీఎల్‌పీవో రాజ్యలక్ష్మి, ఎంపీడీవో సీహెచ్‌.చంద్రశేఖరరాావు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఎన్‌.సత్యారావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement