జిల్లాలో 646 పంచాయతీలు, 6,294 వార్డు స్థానాలకు ఎన్నికలు
మూడు విడతల్లో రెవెన్యూ డివిజన్‌ల వారీగా ఎన్నికలు
జిల్లాలో 12 లక్షల పైచిలుకు ఓటర్లు
సర్పంచ్ అభ్యర్థులకు 25 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులకు ఎన్నికలు
తొలి విడత నవంబర్ 26న, తుది విడత డిసెంబర్ 2న ఎన్నికలు
ఇక
సాక్షి, అనకాపల్లి : రెండు పోరులు ముగిశాయి. ఇక పంచాయతీల వంతు. ఇది చాలా కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ కుర్చీపై కూర్చోవాలనేది అక్కడి కీలక నేతల చిరకాల వాంఛ. రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించే ఎన్నికలే అయినప్పటికీ రాజకీయ నేతల మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉంటుంది. పెద్దరికం, గౌరవం కోసం పంచాయతీ పెద్దలుగా ముద్రకై పోరాటం చేసే ఈ ఎన్నికలు చివరి వరకూ ఉత్కంఠ రేపుతాయి.
మూడు విడతలుగా ఎన్నికలు
జిల్లాలో ఈ నెల 26 నుంచి మూడు విడతలుగా పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. 12 లక్షల పైచిలుకు ఓటర్లున్న ఈ జిల్లాలో 646 పంచాయతీలకు ,6,294 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 13న అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిఽధిలోని మండలాలకు, 18న నర్షీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాలకు, 19న అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల్లో గల పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఎన్నికల రోజు మధ్యాహ్నమే కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.
గుర్తుల కేటాయింపు ఇలా...
సాంకేతికంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు మొత్తం 45 గుర్తులను కేటాయించారు. సర్పంచ్‌లకు 25 గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులను కేటాయించనున్నారు.
వివాదాస్పదంగా రిజర్వేషన్ల మార్పు
జిల్లాలో వివాదాస్పదంగా మారిన 13 పంచాయతీల రిజర్వేషన్‌ల మార్పుపై నిరసనలు చేపడుతున్నా అధికార యంత్రాంగం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రిజర్వేషన్‌ల మార్పుపై అధికార పార్టీ కార్యకర్తలే రోడ్డున పడి నిరసన తెలిపినా, చివరకు పరిషత్ ఎన్నికల్లో రొంగలివానిపాలెం గ్రామానికి చెందిన 849 మంది ఓటు వేయనప్పటికీ జిల్లా ఎన్నికల అధికారులు దీనిపై ఒక అధికార ప్రకటన గానీ, వివరణ గానీ ఇవ్వకుండానే పరిషత్ ఎన్నికల కౌంటింగ్ చేపట్టడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగు పంచాయతీలకు అడ్డంకి ఎవరు..?
జిల్లాలోని నాలుగు పంచాయతీలకు సంబంధించి కోర్టు కేసులు చూపించి ఎన్నికలు నిలిపివేశారు. ఆయా పంచాయతీలకు సంబంధించి భౌగోళిక స్వరూపాల విభజన, విలీనం వంటి కారణాలు తమకు ఇబ్బందిని కలిగిస్తున్నాయని భావించిన పచ్చనేతలు ఇతర సాంకేతిక సమస్యల్ని చూపిస్తూ కోర్టుని ఆశ్రయించారు. తమ గ్రామాలకు పంచాయతీ ఎన్నికలు జరపాలని స్థానికులు కోరినప్పటికీ, ఎన్నికలు లేనందున అభివృద్ధి జరగడం లేదని మొరపెట్టుకున్నా అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
ఈసారైనా స్లిప్పులు పంపిణీ చేస్తారా..?
గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక పోరులో లోపాలు చాలా కనిపించాయి. ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లను ప్రభావితం చేసే దశ నుంచి కౌంటింగ్ వరకూ చాలా చోట్ల అధికారులు ఒంటెత్తు పోకడలు ప్రదర్శించారు.పేరుకి, ప్రకటనలకు పరిమితం అయిన ఎన్నికల నియమావళి అమలులో గానీ, ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందన ఎక్కడా కనిపించలేదు. రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు చేసినా, ఓటు వేసేందుకు వెళ్లినా తమ ఓటు ఎక్కడుందనే స్పష్టత లేదని ఓటర్లు మొరపెట్టుకున్నా ఏ మాత్రం చలనం లేని విధంగా అధికారులు వ్యవహరించారు. ఇష్టారాజ్యంగా ఓటర్లపై ప్రలోభాలు, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల వెంట తిరిగే నేతలకు బెదిరింపులు వచ్చినట్లు తెలిసినా ఎక్కడా కనీసం హెచ్చరికలు కూడా చేయలేదు. కౌంటింగ్ కేంద్రాల్లో ఫలితాలను ప్రభావితం చేసేలా అధికారులు వ్యవహరించిన తీరు, ఇన్‌వ్యాలిడ్ ఓట్లను పరిగణనలోకి తీసుకోవడంలో పక్షపాతం చూసి అభ్యర్థులు అవాక్కవ డం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లారు. వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినట్లు ఇవి ఎలక్షన్లా..? సెలక్షన్లా..? అనేది ఓటరుకు స్పష్టం అయ్యిందే తప్ప ప్రజాస్వామ్యానికి తగిన రక్షణ లేని స్థితిలో ఈ ఎన్నికలు జరుగుతున్న తీరుపై నిజాయితీగా పోరాడే అభ్యర్థులకు న్యాయం జరగలేదనే విమర్శలు ఉన్నాయి.
సర్పంచ్ గుర్తులు ఇవీ...
మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు సాసరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కర్చీ, బ్యాట్, టెలీఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చంచా గుర్తులను పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య బట్టి ఒక్కో పంచాయతీకి కేటాయిస్తారు.
వార్డు సభ్యుల గుర్తులు
ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇసీ్త్రపెట్టి, పోస్టు డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్‌క్రీమ్, కాటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాట, డిష్ యాంటిన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు


