వెబెక్స్ సమావేశంలో అధికారులు
తుమ్మపాల : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమర్ధంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 26, 29, డిసెంబర్ 2 తేదీలలో మూడు విడతలుగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆమె అధికారులతో మంగళవారం వెబెక్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ఓటరు స్లిప్పులను బీఎల్వోల ద్వారా ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ మౌలిక సదుపాయాలను ముందుగానే పూర్తి చేయాలని, ఎన్నికల విధుల నిర్వహణకు నియమించిన సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రవాణా, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 100 శాతం పకడ్బందీగా శాంతిభద్రతలు ఉండేలా పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అనకాపల్లి, నర్సీపట్నం, అడ్డురోడ్డు ఆర్డీఓలు, శ్రీనివాస్, వి.వి.రమణ, పోలీస్ అధికారులు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


